పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై కేసు నమోదు
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై సిద్దిపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.
దిశ, సిద్దిపేట ప్రతినిధి : కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై సిద్దిపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. వన్ టౌన్ సీఐ కృష్ణారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. శాంతి భద్రతల పరిరక్షణలో నిరంతరం కృషి చేసే పోలీసులపై అనుచిత, అవమానకరమైన వ్యాఖ్యలు చేసిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా పోలీస్ సంఘం అధ్యక్షుడు మన్నె రవీందర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా మన్నె రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. గాంధీ భవన్ లో జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాలమూరు జిల్లా పోలీసుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడడం దారుణమని అన్నారు. అధికారంలోకి రాగానే గుడ్డలూడదీస్తాం, అసలు, మిత్తితో అంతా బయటకు తీస్తామని వ్యాఖ్యానించడం ఏమాత్రం సరి కాదన్నారు.