తెలంగాణలో మరోసారి భారీగా ఐపీఎస్‌ల బదిలీలు

తెలంగాణలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ క్రమంలోనే 12 మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Update: 2024-02-12 15:24 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో పోలీసు, ఎక్సయిజ్, పంచాయితీరాజ్, రెవెన్యూ శాఖల్లో భారీ స్థాయిలో బదిలీలు చోటుచేసుకున్నాయి. రాష్ట్రంలో 13 మంది ఐపీఎస్‌లకు కొత్త పోస్టింగ్‌లు ఇస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. రాచకొండ పోలీసు కమిషనర్ సుధీర్‌బాబును మల్టీజోన్-2 ఐజీగా (మల్టీ జోన్-1 అదనపు బాధ్యతలు కూడా) నియమిస్తూ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి ఉత్తర్వుల జారీచేశారు. ఆ బాధ్యతల్లో ఉన్న తరుణ్‌జోషిని రాచకొండ సీపీగా బదిలీ చేశారు. ప్రస్తుతం వెయిటింగ్‌లో ఉన్న డీఐజీ శ్రీనివాసులును రామగుండం సీపీగా నియమించారు. ఆ స్థానంలో జోగులాంబ (సెవెంత్) జోన్ డీఐజీ ఎల్ఎస్ చౌహాన్‌కు రామగుండం సీపీగా పోస్టింగ్ ఇస్తూ గతంలో (జనవరి 3న) ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేశారు. యధావిధిగా ఆయన జోగులాంబ జోన్ డీఐజీగానే కొనసాగనున్నారు.

గత కొంతకాలంగా వెయిటింగ్‌లో ఉన్న జోయల్ డేవిస్‌ను జోగులాంబ జోన్ డీఐజీగా నియమించాలని జనవరిలో ఉత్తర్వులు జారీ అయినా ఇప్పుడు వాటిని రద్దు చేసి సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీగా నియమించారు. ఆ స్థానంలో ఉన్న నారాయణ నాయక్‌ను స్టేట్ క్రైమ్ రికార్డుల బ్యూరో డీఐజీగా నియమించారు. ప్రస్తుతం ఉమెన్ ప్రొటెక్షన్ సెల్, సీఐడీ ఎస్పీగా ఉన్న అపూర్వారావును ఆర్టీసీ విజిలెన్స్ ఎస్పీగా బదిలీ చేశారు. ట్రాన్స్ కో ఎస్పీగా ఉన్న ఉదయ్‌కుమార్‌ను సౌత్ వెస్ట్ జోన్ డీసీపీగానూ, మల్కాజిగిరి ఎస్ఓటీ డీసీపీగా ఉన్న గిరిధర్‌ను ఈస్ట్ జోన్ డీసీపీగానూ, వెయిటింగ్‌లో ఉన్న మురళీధర్‌ను స్టేట్ పోలీస్ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్‌గానూ, ఆ స్థానంలో ఉన్న నవీన్ కుమార్‌ను హెడ్ క్వార్టర్ (డీజీపీ ఆఫీస్)లో రిపోర్టు చేయాల్సిందిగానూ సీఎస్ ఉత్తర్వులు ఇచ్చారు. రాజేంద్రనగర్ (సైబరాబాద్) డీసీపీగా ఉన్న సధనారష్మి పెరుమాళ్‌ను హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీగా నియమించారు.

ఎక్సయిజ్ శాఖలోనూ బదిలీలు :

లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా దీర్ఘకాలంగా (మూడేండ్లకు పైగా) ఒకే పోస్టింగులో ఉన్న, సొంత జిల్లాల్లో పనిచేస్తున్న ఇద్దరు ఎక్సయిజ్ డిప్యూటీ కమిషనర్లను, తొమ్మిది మంది అసిస్టెంట్ కమిషనర్లను, 14 మంది ఎక్సయిజ్ సూపరింటెంట్లను బదిలీ చేస్తూ ఆ శాఖ స్పెషల్ సీఎస్ ఉత్తర్వులు జారీచేశారు. ఆ శాఖలో పనిచేస్తున్న వివిధ స్థాయిల్లోని 85 మంది సిబ్బందిని కూడా వేర్వేరు ప్రాంతాలకు బదిలీ చేశారు. మరోవైపు పంచాయతీరాజ్ డిపార్టుమెంటులో జిల్లా పరిషత్ సీఈఓలు, జిల్లా పంచాయితీ అధికారులు, డీఆర్‌డీవోలు, అదనపు డీఆర్డీఓలు.. ఇలా వివిధ స్థాయిల్లోని 105 మంది అధికారులను బదిలీ చేస్తూ ఆ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఆర్డర్లు ఇచ్చారు. 


Similar News