బీఆర్ఎస్‌లో మహారాష్ట్ర నుంచి భారీ చేరికలు: ఇంద్రకరణ్ రెడ్డి
మహారాష్ట్రలో భారీ చేరికలకు రంగం సిద్ధమైందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
దిశ ప్రతినిధి, నిర్మల్: బీఆర్‌ఎస్ దేశమంతా వేగంగా విస్తరిస్తోందని ఆంధ్రప్రదేశ్, ఒడిషాల నుంచి ఇప్పటికే పలువురు ప్రముఖ నేతలు అధినేత కేసీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరగా, మహారాష్ట్రలోనూ భారీ చేరికలకు రంగం సిద్ధమైందని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. మహారాష్ట్ర నాందేడ్‌లో ఫిబ్రవరి 5న జరిగే బహిరంగ సభలో కేసీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్ పార్టీలో భారీగా చేరేందుకు సీనియర్ రాజకీయ నేతలు, పలువురు ప్రముఖులు ఆసక్తి చూపుతున్నారన్నారు.
ఇప్పటికే మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యే జోగు రామన్న, టీఎస్‌ఐఐసీ చైర్మన్ బాలమల్లు, సివిల్ సప్లైస్ కార్పోరేషన్ చైర్మన్ రవీందర్ సింగ్, తదితరులు సభ ఏర్పాట్లు, నిర్వహణ, పార్టీ విస్తరణపై దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలోనే మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నాందేడ్ జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తూ... బీఆర్‌ఎస్‌లో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్న నేతలను కలుస్తూ గులాబీ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. గురువారం మహారాష్ట్రకు చెందిన స్థానిక ప్రజాప్రతినిదులు బీఆర్ఎస్‌లో చేరుతున్నారు.
బోకర్ మండలం రాఠీ సర్పంచ్ మల్లేష్ పటేల్ తో సహా 100 మంది మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమక్షంలో గులాబీ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ నాయకులు బామిని రాజన్న ఆద్వర్యంలో కండువాలు కప్పి మంత్రి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న ఎన్నో సంక్షేమ పథకాలను చూసి బీఆర్ఎస్‌లో చేరామని సర్పంచ్ మల్లేష్ తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సీఎం కేసీఆర్ అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు.
తెలంగాణ జరుగుతున్న అభివృద్ధిని చూసి పొరుగు రాష్ట్రాల్లోని ప్రజలు కూడా తెలంగాణ తరహా పథకాలు అమలు చేయాలని కోరుతున్నారని, అందుకే బీఆర్ఎస్‌లో చేరేందుకు అసక్తి చూపుతున్నారని తెలిపారు. అనంతరం బోకర్ తాలూకా రాఠీ, నాంద, మాథూడ్, తదితర గ్రామాల్లో పర్యటిస్తూ మహిళలు, వృద్ధులు, యువకులు, స్థానిక ప్రజాప్రతినిదులను కలుస్తూ ఫిబ్రవరి 5న నాందేడ్‌లో జరిగే సభకు పెద్ద ఎత్తున తరలివచ్చి సభను విజయవంతం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ముధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు బామిని రాజన్న, మాజీ డీసీసీబీ చైర్మన్ రాంకిషన్ రెడ్డి, మాజీ జడ్పీ చైర్మన్ లోలం శ్యాంసుందర్, తదితరులు పాల్గొన్నారు.