ఇక్కడ 100.. అక్కడ 300.. రెండు చోట్ల కాంగ్రెస్‌దే అధికారం: Mallu Ravi

రాష్ట్రంలో వంద సీట్లు, పార్లమెంట్ ఎన్నికల్లో 300 సీట్లు గెలుస్తున్నామని టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ మల్లు రవి పేర్కొన్నారు.

Update: 2023-07-10 14:57 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో వంద సీట్లు, పార్లమెంట్ ఎన్నికల్లో 300 సీట్లు గెలుస్తున్నామని టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ మల్లు రవి పేర్కొన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రంతో పాటు తెలంగాణ రాష్ట్రంలోనూ అధికారం కాంగ్రెస్‌దేనని తేల్చి చెప్పారు. సర్వేలన్నీ తమకే అనుకూలంగా ఉన్నట్లు ఆయన చెప్పారు. బీజేపీ, బీఆర్ఎస్‌ల పతనం మొదలైందన్నారు. ఖమ్మం కంటే కొల్లాపూర్‌లో పెద్ద సభను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ నెల 20న భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నామని, ఆ సభలోనే మాజీ మంత్రి జూపల్లి, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్​రెడ్డిలు చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ సభకు ప్రియాంక గాంధీ చీఫ్​గెస్టుగా హాజరవుతున్నారన్నారు. కొల్లాపూర్ సభ ఖమ్మం కంటే మరింత విజయవంతం అవుతుందన్నారు. బీజేపీలో లుకలుకలు ఉన్నాయని, ఆ పార్టీ నుంచి చాలా మంది నేతలు బయటకు రాబోతున్నట్లు వెల్లడించారు. కాంగ్రెస్‌లో చేరేందుకు నేతలంతా ఆసక్తి చూపుతున్నారన్నారు.

గాంధీభవన్‌లో సత్యాగ్రహ దీక్ష..

పేదలకు న్యాయం జరగాలంటే ప్రజలంతా కాంగ్రెస్​పార్టీకి ఓటేయ్యాలని మల్లు రవి కోరారు. ఎంపీ రాహుల్‌ను ఇబ్బంది పెట్టిన నేపథ్యంలో ఈ నెల 12వ తేదీన గాంధీభవన్‌లో సత్యాగ్రహ దీక్షను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు సత్యాగ్రహ దీక్షను నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సత్యాగ్రహం దీక్షలను దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో చేస్తున్నారన్నారు.

దేశ వ్యాప్తంగా ఐక్యమత్యం కోసం రాహుల్ గాంధీ దాదాపు 4500 కి.మీలు నడిచి ప్రజలకు భరోసా కల్పించారన్నారు. దీన్ని జీర్ణించుకోలేని బీజేపీ రాహుల్‌ను రాజకీయంగా దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నదన్నారు. రాహుల్ గాంధీ పార్లమెంట్ సభత్వాన్ని రద్దు చేయించడం, కోర్టు ఆర్డర్​కాపీ ఇచ్చిన ఒక్క రోజులోనే సభ్యత్వం రద్దు చేయడం వంటివి చేశారన్నారు. దీంతో పాటు ఇళ్లు ఖాళీ చేపించడం, సెక్యూరిటీ కూడా తగ్గించారన్నారు. చిన్న సమస్యను బీజేపీ పెద్దగా చూపించి రాహుల్‌ను దోషిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తుందన్నారు.

Tags:    

Similar News