బీఆర్ఎస్ లో కొత్త సమస్య.. లక్షల సభ్యత్వం ఉన్నా ఏం లాభం?

గులాబీ పార్టీ అనుబంధ సంఘం మహిళా కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలిగా పనిచేసిన గుండు సుధారాణి ఈ ఏడాది ఏప్రిల్ 25న పార్టీకి, అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ లో చేరారు. అప్పటి నుంచి ఈ పోస్టు ఖాళీగానే ఉంది.

Update: 2024-10-23 03:10 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ పార్టీకి మహిళా నేత కొరత ఏర్పడింది. పార్టీ అనుబంధ సంఘం మహిళా విభాగం అధ్యక్షురాలి పోస్టు ఖాళీగా ఉంది. దీంతో మహిళా సమస్యలపై గళం వినిపించేవారు కరువయ్యారు. పార్టీకి 60లక్షల సభ్యత్వం ఉందని చెబుతున్నా సమర్థురాలు లేకపోవడంతోనే నియమించలేదనే ప్రచారం జరుగుతుంది. ప్రధానప్రతిపక్షంగా ఉన్నప్పటికీ మహిళా అనుబంధ సంఘం బలోపేతంపై దృష్టిసారించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే మొదటి నుంచి పార్టీలో పనిచేస్తున్నవారికి ఇస్తారా? లేదా? అనేది విస్తృతంగా చర్చజరుగుతోంది.రాష్ట్రంలో తొమ్మిది నెలల కాంగ్రెస్‌ పాలనలో 1,900 లైంగికదాడి ఘటనలు జరిగాయని ఆరోపిస్తున్న బీఆర్ఎస్ పార్టీకి మహిళల పక్షాన పోరాటం చేసే అనుబంధ సంఘానికి మాత్రం అధ్యక్షురాలు లేకపోవడం విడ్డూరం. పార్టీకి 60లక్షల సభ్యత్వం ఉందని ఘనంగా చెబుతున్నప్పటికీ అందులో పోరాట పటిమ కలిగిన, నాయకత్వ లక్షణాలు ఉన్న మహిళలు లేరా? అనే ప్రశ్న పార్టీ నేతల్లోనే ఉత్పన్నమవుతోంది.

5నెలలుగా అధ్యక్షురాలి పోస్టు ఖాళీ

గులాబీ పార్టీ అనుబంధ సంఘం మహిళా కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలిగా పనిచేసిన గుండు సుధారాణి ఈ ఏడాది ఏప్రిల్ 25న పార్టీకి, అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ లో చేరారు. అప్పటి నుంచి ఈ పోస్టు ఖాళీగానే ఉంది. అయినప్పటికీ ఈ పదవి భర్తీపై అధిష్టానం దృష్టిసారించడం లేదనే చర్చజరుగుతుంది. మహిళకు కాంగ్రెస్ ఎన్నికల్లో ప్రకటించిన 6 గ్యాంరెటీల్లో ఒకటి మహాలక్ష్మి పథకం. ఈ పథకంలో ప్రతి మహిళకు నెలకు 2500లు ఇస్తామని ప్రకటించింది ఇంకా అమల్లోకి రాలేదు. దీనిపై ప్రభుత్వాన్ని పార్టీ మహిళా సంఘం నుంచి ప్రశ్నించేవారే కరువయ్యారు. దీనికి తోడు మహిళలపై జరుగుతున్న దాడులు, లైంగిక ఘటనలపై కార్యచరణ చేపట్టేవారు లేక భరోసా కల్పించేవారే కరువయ్యారు. 5 నెలలుగా అధ్యక్ష పోస్టు ఖాళీగా ఉన్నా అధిష్టానం మాత్రం చోద్యం చూస్తుంది. త్వరగా కమిటీ వేయాలని పార్టీ మహిళా సభ్యులే అధిష్టానంను కోరుతున్నారు.

పనిచేస్తున్న వారికి ప్రియార్టీ ఇస్తారా?

ఉద్యమకాలం నుంచి పార్టీలో పనిచేస్తున్నవారు ఉన్నారు. అయినా కొందరికి అవకాశాలు లేదు. కొందరికి మాత్రం పార్టీ ఎంపీలుగా, ఎమ్మెల్యేలు, జెడ్పీచైర్ పర్సన్లు, కార్పొరేటర్లు, మున్సిపల్ చైర్మపర్సన్, మార్కెట్ కమిటీల అధ్యక్షులుగా ఇలా అవకాశం కల్పించింది. అయితే కొందరు పార్టీ మారి తిరిగి` గులాబీ గూటికి చేరారు. అయితే పార్టీ అధిష్టానం ఎవరికి అవకాశం కల్పిస్తుందనేది చర్చనీయాంశమైంది. పార్టీలో ఇప్పటికే చాలా మంది మహిళా నేతలు మహిళా అధ్యక్షురాలి పోస్టుకోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. కొందరు తనకు అవకాశం ఇవ్వాలని పార్టీ అధిష్టానాన్ని కోరినట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా మూల విజయారెడ్డి, తుల ఉమ, అనితానాయక్, సామల హేమ, మన్నె కవిత, సుశీలారెడ్డి, గుండ్రాతి శారదాగౌడ్, నంగు సుమలత, దీపికా యుగేందర్ ఇలా పలువురు పదవి ఆశిస్తున్నారు. అయితే ఎవరికి పార్టీ అధిష్టానం ఆశీస్సులు ఉంటాయనేది చూడాలి.

అధినేత తీరుపై పార్టీలో చర్చ

పార్టీ బలోపేతంపై కేసీఆర్ ఇంకా చర్యలు చేపట్టలేదు. అనుబంధ కమిటీలపై దృష్టిసారించలేదు. అయితే పార్టీ అన్ని అనుబంధ కమిటీలు వేస్తారా? లేకుంటే అనుబంధ కమిటీకి అధ్యక్షులను నియమించి పూర్తి కమిటీని పెండింగ్ లో పెడతారా? అనేది సస్పెన్స్. ఇప్పటికే నెలల తరబడి అధ్యక్ష పోస్టు ఖాళీగా ఉన్నా మహిళా కమిటీని అన్ని కమిటీలతో పాటే వేస్తారా? ముందు ప్రకటిస్తారా? అసలు కమిటీని వేస్తారా? వేయరా? ఏం చేస్తారు... అధినేత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది పార్టీలో విస్తృతంగా చర్చజరుగుతుంది. ఏదీ ఏమైనప్పటికీ తొలుత మహిళా కమిటీని నియమించాలని, మహిళలపై జరుగుతున్నదాడులపై గళం ఎత్తవచ్చనే అభిప్రాయంను పలువురు వ్యక్తం చేస్తున్నారు. అయితే అధినేత కేసీఆర్ స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్న తరుణంలో ఎవరికి బాధ్యతలు అప్పగిస్తారనేది కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Tags:    

Similar News