Mahesh Goud: మంచి చేస్తే ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయ్.. పీసీసీ చీఫ్ కీలక వ్యాఖ్యలు

రైతులకు మంచి చేస్తే ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయని పీసీసీ చీఫ్​మహేష్​ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.

Update: 2025-01-05 16:16 GMT

దిశ; తెలంగాణ బ్యూరో: రైతులకు మంచి చేస్తే ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయని పీసీసీ చీఫ్​మహేష్​ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. రూ. 22 వేల కోట్లతో కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేసిందని ఆయన ఆదివారం ఓ ప్రకటనలో గుర్తు చేశారు. రైతు భరోసా కింద రైతులందరికీ ఎలాంటి ఆంక్షలు లేకుండా ఎకరానికి రూ.12 వేలు రూపాయలు కేటాయిస్తూ కేబినెట్ నిర్షయం తీసుకోవడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ ఎకరాకు రూ. 10 వేల రూపాయల నుంచి రూ. 12 వేల రూపాయల భరోసా ఇవ్వడం పట్ల ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇంతటి ఆర్థిక నిర్బంధం, తీవ్రమైన ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ , అన్నదాతకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడడం కాంగ్రెస్ పార్టీ నిబద్ధతకు నిదర్శనమన్నారు. రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం విచ్చలవిడిగా అప్పులు చేసి, ఆర్థిక విధ్వంసం చేసిందన్నారు.

అనాలోచిత నిర్ణయాలు, ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం, అడ్డగోలు వ్యవహారాలు, కమిషన్లకు కక్కుర్తి పడి అడ్డమైన పనులు చేయడంతో రాష్ట్రం ఆర్థికంగా కుప్పకూలిపోయిందన్నారు. రాష్ట్రం రూ.7 లక్షల కోట్ల రూపాయల అప్పులతో ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. అయినప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే విషయంలో ఎక్కడ వెనకడకుండా మేలు చేస్తున్నామన్నారు. ధాన్యం కొనుగోలు కు క్వింటాలు కు రూ.500 రూపాయల బోనస్ కూడా అందజేస్తున్నామన్నారు. గత ఏడాది రైతు భరోసా ఇవ్వగా, ఈ ఏడాది జనవరి 26 నుంచి రూ.12 వేల రూపాయలు ఎకరాకు భరోసా పెంచి ఇస్తున్నామన్నారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద భూమి లేని పేదలకు, కౌలు రైతులకు రూ. 12 వేల రూపాయలు ఇవ్వబోతున్నామన్నారు. ఇలాంటి గొప్ప పథకాలను అందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో మంచి ఆదరణ లభిస్తోందన్నారు. ప్రతిపక్ష బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ లు కాంగ్రెస్ పై విషం చిమ్మేందుకు ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు.


Similar News