ఉమ్మడి జిల్లాలో రెండు ఎంపీ స్థానాలు గెలుస్తాం : డీకే అరుణ
మోదీ ప్రభంజనంతో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్ రెండు ఎంపీ స్థానాలను గెలుస్తామని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు.
దిశ, అలంపూర్ టౌన్: మోదీ ప్రభంజనంతో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్ రెండు ఎంపీ స్థానాలను గెలుస్తామని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నాగర్ కర్నూల్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి భరత్ ప్రసాద్ ఆయన తండ్రి ఎంపీ రాములుతో కలిసి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఐదవ శక్తి పీఠమైన జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ… 10 సంవత్సరాలుగా ప్రజల సంక్షేమ భద్రత కోసం పాటుపడుతున్న ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టిస్తున్న సందర్భంగా వారికి ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండేలా చూడాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు.
అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ అత్యధిక పార్లమెంట్ స్థానాలను గెలిచే విధంగా జోగులాంబ తల్లి ఆశీర్వదించాలని కోరినట్లు తెలిపారు. ఈసారి నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థిగా భరత ప్రసాద్‌ను ప్రకటించినట్లు పేర్కొన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థి భరత్‌ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. అనంతరం భరత్ మాట్లాడుతూ… అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఎన్నికల శంఖారావానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. నరేంద్ర మోదీ ఆశీస్సులతో డీకే అరుణ సహకారంతో భాజపా అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను గెలిపించాలని అభ్యర్థించారు . గతంలో తన తండ్రికి సహకరించినట్లు ఈసారి కూడా సహకరించాలని కోరారు. గెలిచిన తర్వాత నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభివృద్ధికి అదే విధంగా జోగులాంబ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. తన కుమారుడిని ఆశీర్వదించాలని ఎంపీ రాములు కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ ఆచారి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామచంద్ర రెడ్డి బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.