ప్రాజెక్టుల పేరుతో దోపిడీ చేస్తే అడ్డుకుంటాం : ఎంపీ డీకే అరుణ
పాలమూరు అభివృద్ధికి తమ పార్టీ ఎట్టి పరిస్థితులను అడ్డుకోబోదని
దిశ, జడ్చర్ల : పాలమూరు అభివృద్ధికి తమ పార్టీ ఎట్టి పరిస్థితులను అడ్డుకోబోదని,గత ప్రభుత్వం ప్రాజెక్టుల పేరుతో పెద్ద ఎత్తున దోపిడీ చేసిందని ఎంపీ, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు.ఇప్పుడు ఆ ప్రభుత్వం లాగే రాష్ట్ర ప్రభుత్వం చేస్తే అడ్డుకొని తీరుతామని స్పష్టం చేశారు. సోమవారం జడ్చర్లలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. పాలమూరు అభివృద్ధి కోసం మొదటి నుంచి తమ వంతు ప్రయత్నాలు చేసాం.. ఇక ముందు కూడా చేస్తాం.. ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందంటే సహకరించడానికి తమ పార్టీ సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్రంలో అమలు అవుతున్న అభివృద్ధి పనులలో కేంద్ర ప్రభుత్వం వాటా కూడా ఉంది అన్న విషయాన్ని ఈ రాష్ట్ర పాలకులు గుర్తించాలని, అభివృద్ధి, ప్రభుత్వ కార్యక్రమాలలో మాకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు వల్ల ఈ జిల్లాకు పెద్దగా ప్రయోజనం ఉండదు అన్నారు. ఇప్పటివరకు జరిగిన పనులను ఎక్కడికి అక్కడ ఆపేసి జూరాల నుంచి ఎత్తిపోతలను చేపట్టి మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీలకు సాగునీటిని అందించాలని ఆమె డిమాండ్ చేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో అన్ని గ్రామాలు, తండాలకు రోడ్లు వేస్తాము అని చెప్పడాన్ని స్వాగతిస్తున్నాం.. అవసరమైన ప్రతి తండాకు, గ్రామానికి సింగిల్, డబుల్, అవసరమైన చోట్ల ఫోర్ లైన్స్ వెయ్యాలి అని ఆమె డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 6 గ్యారంటీలు అమలు చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నారు.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మినహాయిస్తే.. ఇప్పటివరకు పుట్టి స్థాయిలో రైతులకు రుణమాఫీ జరగలేదు.. రైతు బంధు రాలేదు, నిరుద్యోగులకు జీవన భృతి, పెన్షన్ .. కళ్యాణ లక్ష్మి లో భాగంగా తులం బంగారం ఎక్కడ అమలు అయ్యాయని ఆమె ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యే చింతిల రామచంద్రారెడ్డి,నగురావు నమోజీ,జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి,సాహితీ రెడ్డి,బురుజు సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.