రైతుల అక్రమ అరెస్ట్ ఖండిస్తున్నాం: డీకే అరుణ
గట్టు మండలం చిన్నోని పల్లె గ్రామంలో పోలీసు బలగాలు అర్ధరాత్రి రైతులను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా డిస్తున్నామని మాజీమంత్రి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు.
దిశ, గద్వాల: గట్టు మండలం చిన్నోని పల్లె గ్రామంలో పోలీసు బలగాలు అర్ధరాత్రి రైతులను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా డిస్తున్నామని మాజీమంత్రి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ముందుగా ఆమె ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏవీఎన్ రెడ్డి గెలుపు పట్ల ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలిపారు. చిన్నోని పల్లె రిజర్వాయర్ ను రద్దు చేయాలని అక్కడి రైతులు 422 రోజులుగా దీక్ష చేసిన తెలంగాణ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు లేదన్నారు. చిన్నోనిపల్లె రిజర్వాయర్ విషయంపై ఆనాడే రూలింగ్ పార్టీలో ఉన్న ఫిర్యాదు చేశానన్నారు.
ప్రాజెక్టు వల్ల ఇక్కడ స్టోరేజీకి మాత్రమే తప్ప ఆయకట్టు లేదని తెలిపానన్నారు. 9 ఏళ్లగా ప్రభుత్వానికి అవసరం రాని ప్రాజెక్టు ఇప్పుడిప్పుడే ఎందుకు గుర్తుకొచ్చిందని ప్రశ్నించారు. ఓట్లప్పుడు మాత్రమే ఇక్కడ ప్రాజెక్టులు గుర్తుకొస్తాయా అని ప్రశ్నించారు. ఇక్కడి రిజర్వాయర్ కు ఆయకట్టు లేదని అధికారులకు తెలుసని చెప్పారు. కరీంనగర్ జిల్లా చిగురుమావి మండలం ఓబులాపురం గ్రామంలో తోటపల్లి రిజర్వాయర్ ను రద్దు చేసినట్లే ఇక్కడి ప్రాజెక్టును రద్దు చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
ఆనాడు రాయలసీమ రైతులు ఇక్కడి రైతులు నీటి కోసం తలలు పగలగొట్టుకున్నారని, ఇప్పుడు జిల్లాలోని రెండు నియోజక వర్గాల రైతులు తలలు పగలగొట్టుకునే పరిస్థితికి తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిందని విమర్శించారు. ప్రాజెక్టు రద్దు చేయడంతో పాటు అరెస్ట్ చేసిన రైతులను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గడ్డం కృష్ణారెడ్డి, పట్టణ అధ్యక్షుడు బండల వెంకట రాములు తదితరులు పాల్గొన్నారు.