ఆశలపై నీళ్లు.. అకాల వర్షాలతో అపార నష్టం
ఈదురు గాలులతో కూడిన భారీ వర్షానికి కొల్లాపూర్ మండలంలోని రైతులకు తీవ్ర నష్టం జరిగింది.
దిశ, కొల్లాపూర్: ఈదురు గాలులతో కూడిన భారీ వర్షానికి కొల్లాపూర్ మండలంలోని రైతులకు తీవ్ర నష్టం జరిగింది. మారిన వాతావరణ పరిస్థితులు, అకాల వర్షాలు, ఈదురు గాలులతో వరి సాగు చేసిన రైతులను ఆగం చేశాయి. ఆరుగాలం పడిన కష్టానికి పంట చేతికొస్తుందని సంబురపడుతున్న దశలోనే రైతుల ఆశలను ఈదురు గాలులు గల్లంతు చేశాయి. నల్లమల గ్రామాలైన ముక్కిడి గుండం, నార్లాపూర్, మొల చింతపల్లి లో చేతికొచ్చిన పంట నష్టం జరిగిందని బాధిత రైతులు వాపోతున్నారు. అలాగే రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని తెలంగాణ గిరిజన సంఘం నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు అశోక్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. వర్షాలకు, ఈదురు గాలులతో నేల పడిపోయిన వరి పంటలను ఆయా గ్రామాల్లో రైతులతో కలిసి శనివారం ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ.. గత మూడు,నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చేతికొచ్చే దశలో వరి పంట నేలమట్టం కావడంతో..రైతులు తీవ్రంగా నష్టపోయారని విచారం వ్యక్తం చేశారు. భారీ వర్షాలకు రైతులు వేల రూపాయలు సాగుకు పెట్టుబడి పెట్టి పంట చేతికొచ్చే సమయంలో వరి పంట పూర్తిగా నష్టపోయిందని వివిధ గ్రామాల రైతులు ఆవేదన చెందుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. రైతులు ఎకరానికి రూ, 25 వేల నుంచి 30 వేలు సాగు కోసం పెట్టుబడులు పెట్టారని ఆయన తెలిపారు. ఇంకొక నెలలో కోతకొచ్చే వరి పంట అకాల వర్షాలకు పూర్తిగా దెబ్బతిన్నదని అశోక్ తెలిపారు. వర్షాలకు, ఈదురు గాలులతో పూర్తిగా వరి చేను నేలపై చాపలాగాపడి, కింద బురదలో పాలకంకులతో పడి వరి మొలకెత్తి దెబ్బతిన్నదని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయ అధికారులు గ్రామాల్లో క్షేత్ర స్థాయిలో పంటలను పరిశీలించి..పంట నష్ట అంచనాలను రూపొందించి ప్రభుత్వానికి నివేదికను పంపించాలని అశోక్ డిమాండ్ చేశారు. నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు వెంకట్ స్వామి, రాముడు, శంకరయ్య ,గోపాల్ చంద్రు తదితరులు పాల్గొన్నారు.