దిశ, అలంపూర్: తుంగభద్ర డ్యామ్ గేట్ కొట్టుకుపోయింది. డ్యామ్ లో ఉన్న నీరు ఉధృతంగా కిందకు దూకుతున్నాయి. వరద ఉధృతి గంట గంటకూ పెరుగుతోంది. దాంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. తుంగభద్ర డ్యామ్ కు వరద ఉధృతి భారీగా పెరుగుతోంది. ఈ క్రమంలోనే శనివారం రాత్రి 11 గంటల సమయంలో 19వ గేట్ కొట్టుకుపోయింది. 69ఏళ్ల తుంగభద్ర డ్యామ్ చరిత్రలో ఫస్ట్‌టైమ్ ప్రమాదం జరిగింది.
తుంగభద్ర గేట్ కొట్టుకుపోతే దాని ప్రభావం ఏపీలోని కర్నూలు జిల్లాలో, తెలంగాణలోని జోగులాంబ జిల్లాపై పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రెండు జిల్లాల్లో నది తీర ప్రాంత ప్రజలు కాస్త అలెర్ట్ గా ఉండాలని చెబుతున్నారు. ఈ రోజు నిపుణుల బృందం తుంగభద్ర డ్యామ్ ను పరిశీలించి గేటుకు మరమ్మతులు చేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కిందకు నీళ్లు ఉధృతంగా వస్తున్నందున నది తీర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా హెచ్చరించారు. మొత్తం గేట్లను 20 అడుగుల మేర ఎత్తారు. అయితే, వరద ఉధృతి తగ్గితే గేట్ రిపేర్‌పై ఫోకస్ పెట్టనున్నారు. కర్ణాటక మంత్రి శివరాజ్ ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలుసుకొని సమీక్షిస్తున్నారు. తుంగభద్ర డ్యాంకు ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే కూడా పరిశీలించుకోవాలని... డ్యాంకు వస్తున్న వర్షపు నీరు నది నీరు ఎక్కువగా ఉండడంతో ఎప్పటికప్పుడు దిగువకు వదలాలని ఆయన ఆదేశించారు.