మా బడికి సారోళ్ళు వస్తలేరు..

నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం కుందారం తండా ప్రాథమిక పాఠశాలలో ఐదుగురు విద్యార్థులు చదువుతున్నారు.

Update: 2024-12-12 07:00 GMT

దిశ, నాగర్ కర్నూల్ /వెల్దండ : నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం కుందారం తండా ప్రాథమిక పాఠశాలలో ఐదుగురు విద్యార్థులు చదువుతున్నారు. గత కొన్ని రోజుల నుంచి ఉపాధ్యాయులు రావడం లేదని ఆ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో తమకు తామే విద్యాబోధన చేసుకుంటున్నారు. రోజుకు ఒక టీచర్ చుట్టం చూపుగా వచ్చి వెళ్తుంటారని తమకు పాఠాలు చెప్పకుండా తిని మధ్యాహ్నం ఇంటికి వెళ్లిపోండి అని చెప్తారని తెలిపారు. సమయపాలన కూడా పాటించరని తెలిపారు. గురువారం ఉదయం 9:30 దాటినా ఉపాధ్యాయులు రాకపోవడంతో వారే స్కూల్ తాళం తీసి ఊడ్చుకొని ప్రార్థన చేసి క్లాసులో కూర్చున్నారు.

గ్రామస్తులు గమనించి విద్యార్థులను మందలించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. సారోళ్లు రాకుంటే మేము ఐదుగురం స్కూల్ మానేస్తామని విద్యార్థులు చెబుతున్నారు. ఈ విషయం పై వెల్దండ మండల ఎంఈఓను వివరణ కోరగా.. అక్కడ ఉన్న ఉపాధ్యాయురాలు గాయత్రి మెటర్నిటీ లీవ్ లో వెళ్ళిందని తెలిపారు. ఆమె స్థానం ఇంచార్జ్ గా శ్రీశైలంని నియమించాం అన్నారు. ఆయన లీవ్ లో ఉన్నారో ఏమో నాకు ఎలా తెలుస్తుంది. నేను జూమ్ మీటింగ్ లో ఉన్నాను, డిస్టర్బ్ చేయకండి ఆ కాంప్లెక్స్ ఇంచార్జ్ శ్రీనివాసులకు ఫోన్ చేసి వివరణ తీసుకోండి అన్నారు. ఇంచార్జి శ్రీనివాసులకు ఫోన్ చేయగా.. శ్రీశైలంను వేరే స్కూల్ కి పంపి, శ్రీనివాసరావు అనే ఉపాధ్యాయున్ని కుందారం తండాకు పంపారని తెలిపారు.


Similar News