ఉమ్మడి మహబూబ్ నగర్ కాంగ్రెస్లో వింత పరిస్థితి.. ఎవరికీ వారే అన్నట్లుగా నేతల తీరు
నేతల మధ్య ఐక్యత లేక దశాబ్దం కాలంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ చతికిల పడిపోయింది.
దిశ బ్యూరో, మహబూబ్ నగర్ నగర్: నేతల మధ్య ఐక్యత లేక దశాబ్దం కాలంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ చతికిల పడిపోయింది. అధికారం లేకపోయినా.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని ఆశిస్తున్న నేతల మధ్య సఖ్యత లేకపోవడం.. ఎవరికి వారు కార్యక్రమాలు నిర్వహించడం.. రాష్ట్ర, జాతీయ స్థాయి నేతలతో పరిచయాలను ఏర్పాటు చేసుకొని గ్రూపు రాజకీయాలు చేయడం , అధికార పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలపై చెప్పుకోదగిన స్థాయిలో పోరాడకపోవడం వంటి కారణాలతో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి పూర్తిగా దెబ్బతిన్నది.. పరిస్థితులను చక్కదిద్దుకొని ఎప్పటికప్పుడు ఎన్నికలకు సన్నద్ధం కావాల్సిన నేతలు.. సరైన విధానాలలో అడుగు ముందుకు వేయకపోవడంతో నేడు ఆ పార్టీ పరిస్థితి అయోమయంగా మారింది.. ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అయినా పరిస్థితులు మెరుగుపడతాయని పార్టీ శ్రేణులు ఆశించాయి.
కానీ ప్రయోజనం లేకపోయింది.. నియోజకవర్గాలలో ఎవరికివారు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆధిపత్యాన్ని ప్రదర్శించుకునే యత్నాలు చేశారు తప్ప.. పార్టీని బలోపేతం చేయాలనే ఆలోచన చేయలేదని విమర్శ వినిపిస్తోంది. ఒకరిద్దరు నేతలు మినహాయిస్తే మిగతా అందరూ కూడా తమ రాజకీయ భవిష్యత్తు కోసం చేస్తూ వచ్చారు. ఇలాంటి పరిస్థితులలో ఇటీవల కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని తీసుకువచ్చింది.. ఇలాంటి సందర్భాలలో పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ సమిష్టిగా.. కలిసికట్టుగా ఉంటూ అధికార పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు.. తమలో ఎవరికి టిక్కెట్ వచ్చినా ఎన్నికలలో కలిసికట్టుగా పోరాడి విజయ సాధిస్తాము అనే నమ్మకాన్ని పార్టీ శ్రేణులకు కల్పిస్తే తప్ప ఉమ్మడి పాలమూరు జిల్లాలో పార్టీ పుంజుకునే పరిస్థితులు ఉండవు.
ఇవి సమస్యలు
ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పలు నియోజకవర్గాలలో పార్టీ అభ్యర్థులుగా పోటీ చేసేందుకు పలువురు ఆశావహులు సిద్ధంగా ఉన్నారు. మక్తల్ నియోజకవర్గంలో డీసీసీ అధ్యక్షుడు శ్రీహరి, యువ నాయకుడు ప్రశాంత్ రెడ్డి మధ్య సఖ్యత ఎంత మాత్రం లేదు. జడ్చర్ల నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే, డీసీసీ ఉపాధ్యక్షుడు ఎర్ర శేఖర్, పీసీసీ ప్రధాన కార్యదర్శి అనిరుద్ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉన్నాయి. కొల్లాపూర్ నియోజకవర్గంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి అభిలాషరావు, సీనియర్ నేత జగదీశ్వరరావు మధ్య కూడా ఆధిపత్య పోరు సాగుతోంది. వచ్చే ఎన్నికలలో టికెట్ నాది అంటే కాదు నాది అన్నట్లుగా వారు వ్యవహరిస్తున్నారు. వనపర్తి నియోజకవర్గంలో మాజీ మంత్రి చిన్నారెడ్డి, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డి వచ్చే ఎన్నికలలో టికెట్ నాకు అంటే కాదు నాకు అన్నట్టు వ్యవహరిస్తున్నారు.. ఒకరిపై మరొకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. దేవరకద్ర నియోజకవర్గంలో డీసీసీ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ కుమార్ గౌడ్, యువ నేత ప్రశాంత్ రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. వీరు ముగ్గురు కలిసికట్టుగా కాక ఇష్టారాజ్యంగా కార్యక్రమాలు చేయడంతో పార్టీ కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో నాగం జనార్దన్ రెడ్డి పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్న అధికార పార్టీని ఇరుకునపెట్టే పరిస్థితులు కనిపించడం లేదు. కల్వకుర్తి నియోజకవర్గంలో అయితే పార్టీని ముందుకు నడిపించే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వంశీ చందర్ రెడ్డి ఢిల్లీకి పరిమితం కావడంతో పార్టీ పరిస్థితి అయోమయంగా మారింది.
నారాయణపేట నియోజకవర్గం లో పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాల్సిన శివకుమార్ రెడ్డి వ్యక్తిగత కారణాలతో గత సంవత్సరం కాలంగా నియోజకవర్గానికి దూరంగా ఉంటూ వచ్చారు.. ఇటీవల ఆయన నియోజకవర్గానికి వచ్చి పోతున్నప్పటికీ పార్టీ చెప్పుకోదగిన స్థాయికి చేరుకోలేకపోతోంది. అచ్చంపేట నియోజకవర్గంలో మాత్రం డాక్టర్ వంశీకృష్ణ తనదైన స్థాయిలో అధికార పార్టీకి దీటుగా పార్టీని రూపొందించడంలో సక్సెస్ అయ్యారు. అలంపూర్ నియోజకవర్గంలో పీసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ పార్టీ శ్రేణులను కలుపుకుంటూ తనదైన స్థాయిలో ముందుకు సాగుతున్నారు.మహబూబ్ నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్న మాజీ డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్, పీసీసీ ప్రధాన కార్యదర్శిలు సంజీవ్ ముదిరాజ్, వినోద్ కుమార్ పార్టీ టికెట్ ఆశిస్తున్నారు.. కానీ కార్యక్రమాలను మాత్రం రెండు మూడు నెలల నుండి కలిసికట్టుగా చేస్తున్నారు . గద్వాల జిల్లాలో పార్టీ పరిస్థితి దయనీయంగా ఉంది. ఇక్కడ బీజేపీ , బీఆర్ఎస్‌కు బలమైన పోటీ ఇచ్చే అభ్యర్థులే లేరు. డీసీసీ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి ఇక్కడి నుంచి పోటీ చేయాలనే ఆలోచనతో ఉన్నారు. ఎవరు పోటీ చేయాలన్న పార్టీని పునర్నిర్మానం చేయాల్సిన అవసరం ఉంది. రెండు మూడు నియోజకవర్గాలలో సీనియర్లకు బదులు. యువ నాయకులను రంగంలోకి దించడం ద్వారానే ప్రయోజనం ఉంటుందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
సభ సాక్షిగా.. ఐక్యత రాగం ఆలపిస్తేనే..!!
ఉమ్మడి పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పలు నియోజకవర్గాలలో బలమైన కేడర్ ఉంది. ముఖ్యమైన నాయకులు కార్యకర్తలు మధ్య ఐక్యత ఏర్పడి.. కలిసికట్టుగా పోరాడితేనే పార్టీకి పూర్వ వైభవం రానుంది. నాయకుల మధ్య విభేదాలు లేవు అందరూ కలిసికట్టుగా ఉన్నారు అనే సంకేతాలు గురువారం జడ్చర్ల నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో ప్రజలలోకి బలంగా వెళ్లగలిగేలా అడుగులు వేస్తేనే పార్టీకి ప్రయోజనం చేకూరుతుందన్న అభిప్రాయాలను రాజకీయ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.