మీ ఇష్టం ఉన్నోళ్లకు చెప్పుకోండి!.. బీచుపల్లి ఆలయ పూజారులపై ఆరోపణల వెల్లువ

బీచుపల్లి ఆలయం అసౌకర్యాలకు అడ్డాగా మారింది. దక్షిణ తెలంగాణలో ఉన్న ఈ పుణ్య క్షేత్రంలో సౌకర్యాలు అరకొరగా ఉన్నాయని భక్తులు ఆరోపిస్తున్నారు.

Update: 2024-01-17 02:30 GMT

దిశ, ఎర్రవల్లి : బీచుపల్లి ఆలయం అసౌకర్యాలకు అడ్డాగా మారింది. దక్షిణ తెలంగాణలో ఉన్న ఈ పుణ్య క్షేత్రంలో సౌకర్యాలు అరకొరగా ఉన్నాయని భక్తులు ఆరోపిస్తున్నారు. ఈ పుణ్యక్షేత్రంలో దైవ దర్శనం కోసం వచ్చే భక్తుల నుంచి స్థానిక అర్చకులు వసూళ్ల పర్వం కొనసాగిస్తున్నారని పలువురు ఆరోపించారు. మరణించిన వారి అస్తికలను పవిత్ర కృష్ణానదిలో కలిపేందుకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ ఆలయానికి వస్తుంటారు. ఏ ఆలయంలో అయినా.. ప్రత్యేక పూజలు చేయించాలంటే ప్రభుత్వం విధించిన రుసుము చెల్లించి రశీదు తీసుకున్న తరువాతే పూజారులు పూజలు ప్రారంభిస్తారు.

కానీ, బీచుపల్లిలో మాత్రం ప్రభుత్వ ఆదేశాలు బేఖాతరు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక్కడున్న పంతుళ్లు చదివిందే మంత్రం అడిగినంత ఇవ్వాల్సిందే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పుట్టెడు దుఖంతో మరణించిన వారి అస్తికలు నదిలో కలపడం కోసం వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల నుంచి పూజారులు రకరకాలుగా పూజలు చేయాలని ఎక్కడా లేని విధంగా పూజలు చేస్తూ రెండు నిముషాలల్లో చదివే మంత్రాలకు రూ.2 వేల నుంచి రూ.10 వేల వరకు వసూలు చేస్తూ.. దండుకుంటున్నారని టాక్. ఒకవేళ ఇదేంటని ప్రశ్నిస్తే.. మీకు ఇష్టం ఉన్న దగ్గర చెప్పుకోండంటూ బెదరింపులకు దిగుతున్నారు. దీంతో భక్తులు ఏమీ చేయలేక వారు అడిగినంత ఇచ్చేస్తున్నారు.

ఆలయంలో ఇంత జరుగుతున్నా.. ఆలయ చైర్మన్, ప్రభుత్వ అధికారులు పంతుళ్ల అక్రమార్జనపై చర్యలు తీసుకుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. బీచుపల్లిలో ఐదు రకాల పూజల వసూళ్లపై రాష్ట్ర దేవాదాయ కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని.. సోమవారం అస్తికలు కలిపేందుకు వచ్చిన ఓ భక్తుడు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అదేవిధంగా పుష్కరాల సమయంలో నిర్మించిన బాత్‌రూమ్స్, టాయిలెట్లకు తాళాలు వేశారు. దీంతో భక్తులు కాలకృత్యాలు తీర్చుకునేందుకు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా ఆలయ కమిటీ, దేవాదాయ శాఖ అధికారుల స్పందించి సమస్యను పరిష్కరించాలని భక్తులు కోరుతున్నారు. 

Tags:    

Similar News