కండ్ల ముందే కొట్టుకుపోతున్న ధాన్యాన్ని చూసి రైతుల కన్నీళ్లు
గురువారం జడ్చర్ల పట్టణంలో మధ్యాహ్నం అకాల వర్షం కురిసింది. దీంత బాదేపల్లి మార్కెట్ యార్డులో రైతన్నలు అమ్ముకోవడానికి తీసుకొచ్చిన మొక్కజొన్న ధాన్యం తడిసి ముద్దవ్వడంతో పాటు వర్షపు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయింది.
దిశ, జడ్చర్ల : గురువారం జడ్చర్ల పట్టణంలో మధ్యాహ్నం అకాల వర్షం కురిసింది. దీంత బాదేపల్లి మార్కెట్ యార్డులో రైతన్నలు అమ్ముకోవడానికి తీసుకొచ్చిన మొక్కజొన్న ధాన్యం తడిసి ముద్దవ్వడంతో పాటు వర్షపు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయింది. కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి మార్కెట్ యార్డ్ కు తెచ్చిన ధాన్యం రైతు కండ్ల ముందే వర్షపు నీటి ప్రవాహంలో కొట్టుకుపోతుంటే..దిక్కుతోచని స్థితిలో ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు పడరాని కష్టాలు పడ్డారు. దీంతోపాటు బాదేపల్లి మార్కెట్ యార్డ్ లో గురువారం మొక్కజొన్న 6689 క్వింటాళ్ల మొక్కజొన్న ధాన్యాన్ని రైతులు తీసుకువచ్చారు. ఈ క్రమంలో మార్కెట్ అధికారులు టెండర్ వేసి కాంటాక్ట్ చేయాల్సిన ఉన్నది. రైతులు అప్పటికే రాశులు పోసి ధాన్యాన్ని ఆరబెట్టి ఉన్నారు. మధ్యాహ్నం ఒక్కసారిగా భారీ ఎత్తున అకాల వర్షం కురవడంతో.. వర్షపు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయింది. వర్షం వచ్చిన సమయంలో ధాన్యం కుప్పలపై ప్లాస్టిక్ కవర్లు కప్పిన యార్డు ఆవరణ అంతా సిమెంటు నిర్మాణం ఉండడంతో..వర్షం వచ్చిన వెంటనే నీళ్లు రాశుల కిందకు పోయాయని రైతులు వాపోయారు. వ్యాపారులు తడిసిన ధాన్యాన్ని తక్కువ ధరలకు కేటాయిస్తారని, తాము తీవ్రంగా నష్టపోతామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తడిచిన ధాన్యానికి మంచి ధరలు కేటాయించి..వర్షపు నీటిలో కొట్టుకుపోయిన ధాన్యానికి పరిహారం చెల్లించి ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేశారు
తనను ప్రభుత్వమే ఆదుకోవాలి రైతు గోపాల్
తాను తనకున్న మూడు ఎకరాల వ్యవసాయ పొలంలో మొక్కజొన్న పంట వేసి వచ్చిన దిగుబడిని బాదేపల్లి మార్కెట్ యార్డ్ లో అమ్ముకోవడానికి రెండు ట్రాక్టర్లలో తీసుకువచ్చానని రైతు గోపాల్ అన్నారు. షెడ్లలో స్థలం లేకపోవడంతో షెడ్డు బయట ధాన్యాన్ని ఆరబెట్టానన్నాడు. మధ్యాహ్నం ఒక్కసారిగా అకాల వర్షం కురవడంతో.. తాను తీసుకొచ్చిన ధాన్యంలో సగం ధాన్యం వర్షపు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయిందని,వర్షపు నీటిలో ధాన్యం కొట్టుకపోకుండా ఆపడానికి శతవిధాల ప్రయత్నించిన ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. తన కష్టం మొత్తం అరగంట వర్షపు నీటిలో కొట్టుకుపోయిందని రైతు గోపాల్ కన్నీరుమున్నీరయ్యాడు.