రేపటి నుంచి శంకరలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు
ఊట్కూర్ మండలంలోని శ్రీ శంకర లింగేశ్వర బ్రహ్మోత్సవాలు రేపటి నుండి ప్రారంభం కానున్నాయి.
దిశ, ఊట్కూర్ : మండల కేంద్రానికి ఏడు కిలోమీటర్ల దూరంలో తెలంగాణ కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో ఉన్న ప్రసిద్ధ శ్రీ శంకర లింగేశ్వర బ్రహ్మోత్సవాలు రేపటి నుండి అమావాస్య వరకు జరగనున్నాయి. కోరిన కోరికలను తీర్చే స్వామి అని భక్తులు నమ్ముతారు. శనివారం తెల్లవారుజామన అగ్నిగుండం, ఆదివారం రథోత్సవం నిర్వహించనున్నారు. 15 రోజులపాటు భక్తులు భక్తిశ్రద్ధలతో స్వామివారిని పూజించి మోక్కులు తీర్చుకుంటారు. ప్రాచీన కాలం నాటి ఆలయం కావడంతో స్వామివారికి నిత్యం దీపారాధన, నైవేద్యాలు అందిస్తుంటారు.
సూర్యోదయం కాగానే స్వామి వారిపై కిరణాలు పడే విధంగా ఆలయాన్ని నిర్మించారు. పూర్వం ఇక్కడి పశువుల కాపరులతో స్వామివారు ఆటపాడలతో గడిపేవారని, ఓ రోజు అకస్మాత్తుగా కాపరుల నుంచి అదృశ్యమై ప్రస్తుతం స్వామివారి ఉన్న ప్రాంతంలో వెలిసినట్లు ఇక్కడి ప్రజల నమ్మకం. గర్భగుడికి ఎడమ వైపున ఉన్న నంది విగ్రహం ముక్కులో నిత్యం నీటి తడి ఉంటుందని ప్రజలకు నమ్మకం. ఆలయంలోని గర్భగుడిలో ఉన్న స్తంభాలు భక్తులకు వింత అనుభూతిని కలిగిస్తాయి. శంకర్లింగేశ్వర దేవాలయాన్ని పూర్వం జనంజేయుడు అనే రాజు నిర్మించినట్లు ఆలయంలో శాసనాలు చెబుతున్నాయి.
స్వామి వారి గర్భగుడి వెయ్యి ఏళ్లకు ఒక్కసారి శిధిలమవుతుందని శిలాశాసనాల్లో ఉందని అర్చకులు పేర్కొన్నారు. రథోత్సవం అనంతర రోజు నుండి స్వామివారి దర్శనానంతరం ఇక్కడి ప్రజలు మాంసాహారం తినటం ఆనవాయితీగా వస్తుంది. ఈ బ్రహ్మోత్సవాల్లో ప్రత్యేకంగా ఎద్దుల సంత ఏర్పాటు చేస్తారు. శంకరుడికి వాహనంగా నంది ఉండటంతో ఈ జాతరలో రైతులు లక్షల రూపాయలు వెచ్చించి ఎద్దులను కొనుగోలు చేస్తారు.
దేవాలయంలో నంది ప్రత్యేకం
పూర్వం మార్చి నెలలో కూడా నంది నాసిక రంధ్రాల నుండి నీరు రావడం శంకర్ లింగేశ్వర స్వామి భక్తికి నిదర్శనమని ఇక్కడి ప్రజలు భావిస్తుంటారు. కొన్ని సంవత్సరాల క్రితం వరకు తెల్లవారుజామున నంది నాసిక రంధ్రాల నుండి చుక్క చుక్క నీరు వచ్చేదని, ప్రస్తుతం బట్ట పెట్టిన తడి అవుతుందని ఇక్కడికీ వచ్చే భక్తులు అంటున్నారు.