పోడు భూముల్లో ఫారెస్ట్ అధికారులు, గిరిజనుల మధ్య వాగ్వివాదం..తీవ్ర ఉద్రిక్తత

పోడు భూముల్లో గిరిజనుల అక్రమ సాగును అటవీ అధికారులు

Update: 2024-10-26 11:02 GMT

దిశ, కొల్లాపూర్: పోడు భూముల్లో గిరిజనుల అక్రమ సాగును అటవీ అధికారులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య శనివారం తీవ్ర వాగ్వివాదం జరిగింది. తోపులాటలతో ఎర్రగడ్డ బొల్లారం అటవీ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది.ఈ సంఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది. కొల్లాపూర్ నల్లమల అటవీ (Nallamala Forest)ప్రాంతంలోని ఎర్రగట్టుబొల్లారం గ్రామ సమీపంలో సర్వే నెంబర్ 399 లో సుమారు ఐదు వేల ఎకరాల పైగా అటవీ భూములు ఉన్నాయి.అయితే గత 25 ఏళ్ల క్రితం ఆ ప్రాంతంలో అటవీ శాఖ అధికారులు సామాజిక వనాల అభివృద్ధి కోసం విస్తృతంగా వివిధ రకాల మొక్కలు నాటారు.క్రమేణా అడవుల రక్షణ కరువై పోయింది.ఇదే అదునుగా భావించిన బోడబండ తండా గిరిజనులు పోడు భూముల సాగు కోసం క్రమంగా అడవులను నరుకుతూ అందులో విత్తనాలు విత్తుతూ పోయారు. విత్తనం సాగును అటవీ శాఖ అధికారులు చెరిపేస్తూ వచ్చారు.

ఆ భూముల్లో అటవీ అధికారులు 10వేల మొక్కలు నాటాలని స్థానిక ఫారెస్ట్ అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.ఐదు రోజుల క్రితం మొక్కలు నాటుటకు అటవీ అధికారులు ప్రయత్నించగా గిరిజనులు అడ్డుపడి చెదరగొట్టారు.ఆ ప్రాంతంలో ఇప్పటికీ 6500 మొక్కలు నాటినట్లు ఎఫ్ ఆర్ ఓ చంద్రశేఖర్ తెలిపారు. ఐదు రోజుల క్రితం గిరిజనుల తో ప్రతిఘటన ఎదురుకావడం తో గుణపాఠం గా నేర్చుకున్న అటవీ అధికారులు శనివారం అచ్చంపేట, అమ్రాబాద్,లింగాల రేంజ్ ల పరిధిల్లో నుంచి భారీ ఎత్తున అటవీ సిబ్బందిని రంగంలోకి దిగింది.వారిని రక్షణగా ఉంచి పెద్ద కొత్తపల్లి మండలం సాతాపూర్ గ్రామం నుంచి కూలీలను రప్పించి మొక్కలు నాటుతూ వచ్చారు.సమాచారం అందుకున్న బోడబండ తండా గిరిజనులు మూకుమ్మడిగా అక్కడికి చేరుకొని మొక్కలు నాటే పనులను ప్రతిఘటించారు.దీంతో ఫారెస్ట్ అధికారులకు గిరిజనులకు మధ్య వాగ్వాదం, తోపులాటలు చోటుచేసుకుంది. కొంత సేపు ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితి చేయి దాటి పోతుండడంతో చంద్రకళ అనే గిరిజన మహిళ పరుగున వెళ్ళి ఓ చెట్టుకు ఉరి పెట్టుకుని ఆత్మహత్యాయత్నానికి యత్నించగా అది గమనించిన తండాకు చెందిన అనిత అనే మహిళ సమయస్ఫూర్తితో వెళ్లి ఆమెను కాపాడారు.

అయినా కూడా ఫారెస్ట్ అధికారులు పోడుభూములలో చెట్లు నాటుతుంటే గిరిజనులు మరోసారి అడ్డుకున్నారు. తమ పొలంలో చెట్లు నాట వద్దని ఓ గిరిజన మహిళ తమను కనుకరించమని సదరు అటవీ అధికారి కాళ్ళ మీద పడింది.గత 20 సంవత్సరాల నుంచి అట్టి భూమిలో సాగు చేసుకుంటున్నామని,తాము సాగు చేసుకున్న భూముల్లో ఫారెస్ట్ అధికారులు దౌర్జన్యం గా వచ్చి పంటను తొలగించి చెట్లు పెడుతున్నారని గిరిజనులు వాపోయారు. మా భూములు మాకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఇదిలావుండగా స్థానిక ఫారెస్ట్ రేంజర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ గత కొంత కాలం నుంచి ఫారెస్ట్ భూములను కొడుతున్నారని సమాచారం రాగా మేము అడ్డుకొని చెట్లు పెడుతున్నట్లు తెలిపారు. గిరిజనులకు ఎలాంటి పట్టాలు లేవని ఆయన పేర్కొన్నారు. ఫారెస్ట్ భూములలో చెట్లు నరికితే కఠిన చర్యలు తీసుకుంటామని ఫారెస్ట్ రేంజర్ చంద్రశేఖర్ హెచ్చరించారు.


Similar News