పాఠశాల విద్యార్థుల పట్ల ఆర్టీసీ సిబ్బంది దాష్టీకం
ఉత్తమ విద్య అభ్యసించాలనే కోరికతో జిల్లా కేంద్రానికి వచ్చే విద్యార్థుల పట్ల ఆయా రూట్లలో నడిపే ఆర్టీసీ సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తున్నారు.
దిశ, గద్వాల రూరల్ : ఉత్తమ విద్య అభ్యసించాలనే కోరికతో జిల్లా కేంద్రానికి వచ్చే విద్యార్థుల పట్ల ఆయా రూట్లలో నడిపే ఆర్టీసీ సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా గద్వాల- ఐజ రూట్ లో ఒక విద్యార్థినీ పట్ల ఆర్టీసీ మహిళా కండక్టర్ దురుసుగా ప్రవర్తించిన సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే మల్దకల్ మండలం అమరవాయి గ్రామ స్టేజ్ దగ్గర విద్యార్థినీలు గద్వాలలోని ఓ పాఠశాలకు వచ్చేందుకు బస్సు కోసం వెయిట్ చేసి ఒక బస్సు ఎక్కారు. పాఠశాలకు చేరుకోవడం ఆలస్యం అవుతుందని కంగారులో ఆ పాప ఆధార్ చూపించడం లేట్ అయింది. దీంతో మహిళ కండక్టర్ చేయి చేసుకుందని విద్యార్థిని కన్నీరు పెట్టుకుంది. బస్సులు సకాలంలో ఆపకపోవడం వల్ల పాఠశాలకు ఆలస్యంగా చేరుకోవాల్సి వస్తోందని, దీంతో క్లాసులు మిస్ అవుతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సకాలంలో పాఠశాలకు చేరుకోవాలని ఉదయం నుంచి ఎదురు చూసినా పాఠశాలకు వెళ్లే సరికి ఉదయం 10 నుంచి 11 అవుతోందని విద్యార్థులు వాపోతున్నారు. దీంతో పాఠశాల యాజమాన్యం సైతం పనిష్మెంట్ ఇవ్వడంతో పాటు క్లాసులు మిస్ అవుతూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. బస్సు కోసం వెయిట్ చేస్తుండగా కొన్ని బస్సులు స్టేజ్ ల దగ్గర ఆపకుండా ఫాస్ట్ గా బస్సులు నడుపుతున్నారని, దీంతో క్లాసులను మిస్ కావాల్సి వస్తోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల సైతం బస్సు ఆపిన తర్వాత మా క్లాస్ మెంట్ పై బస్సు డ్రైవర్ చేయి చేసుకున్నాడని, నేడు నాపై ఒక మహిళా కండక్టర్ చేయి చేసుకున్నదని విద్యార్థిని తెలిపారు.
చెయ్యి ఎత్తితే బస్సు ఆపాలని, మహిళలను గౌరవించడం మన విధి అని కేవలం రాతలకే పరిమితం అవుతున్నాయని వాటి లక్ష్యాలను నీరు కారుస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా విద్యార్థులను మానసికంగా వేధించకుండా ఆర్టీసీ ఉన్నతాధికారులు చర్యలు తీసుకొని, గ్రామాల నుంచి జిల్లా కేంద్రంలో చదివే విద్యార్థుల సంఖ్యను బట్టి సంబంధిత రూట్ లలో బస్సుల సంఖ్యను పెంచాలని, సకాలంలో విద్యార్థులు పాఠశాలకు చేరుకునేలా ఆర్టీసీ సిబ్బంది సహకరించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.