collector : దోమల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి..

వర్షాకాలంలో దోమల వ్యాప్తి కాకుండా పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకునే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు.

Update: 2024-08-07 12:55 GMT

దిశ, రేవల్లి/ గోపాల్పేట : వర్షాకాలంలో దోమల వ్యాప్తి కాకుండా పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకునే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. స్వచ్చదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా బుధవారం ఉదయం వనపర్తి పట్టణంలోని బాలానగర్ కుమ్మరికుంట లో స్థానిక శాసన సభ్యులు తూడి మేఘా రెడ్డి, అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ తో కలిసి గంబుజియా చేపలను వదిలారు. దోమల లార్వను ఆహారంగా తీసుకునే గంభుజియ చేపల్ని నిలువ మురుగు నీటిలో వదలాలని మున్సిపల్ కమిషనర్ కు సూచించారు. దోమల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని వార్డులలో డ్రైన్ లు శుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

పచ్చదనం కార్యక్రమంలో భాగంగా గొపాల్పేట మండల కూడలి రోడ్డు పక్కన మొక్కలు నాటారు కలెక్టర్. రోడ్డుకి ఇరువైపులా ఒకే రకమైన పెద్ద మొక్కలు నాటాలని, వాటిని సంరక్షించే బాధ్యతలు తీసుకోవాలని సూచించారు. అనంతరం రేవల్లి మండలంలో పర్యటించిన కలెక్టర్ చెన్నారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. 11.5 లక్షల వ్యయంతో చేపట్టిన అమ్మ ఆదర్శ పాఠశాల మౌలిక వసతులు ఏర్పాట్లను పరిశీలించారు. పాఠశాలలో తాగునీరు కు ప్లాస్టిక్ నల్లాలు బిగించటం అవి అప్పటికే కొన్ని పాడైపోవడం గమనించిన కలక్టర్ వెంటనే స్టీల్ నల్లాల పెట్టించాలని ఆదేశించారు. ప్రతి తరగతి గదిలో 4 ట్యూబ్ లైట్లు, 2 ఫ్యాన్ లు పాటించాలని ఆదేశించారు. అనంతరం 9వ తరగతి విద్యార్థులతో మాట్లాడిన కలెక్టర్ ఒక చిన్న గణిత లెక్కను ఇచ్చి పరిష్కరించమని విద్యార్థులను సూచించారు. ఇచ్చిన చిన్న లెక్కను పరిష్కరించనందున కలెక్టర్ యం.ఈ.ఒ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుల పై సరైన పర్యవేక్షణ చేయాలని, అన్ని పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

రేవల్లి మండలం కస్తూరిబా పాఠశాలను సందర్శించిన కలెక్టర్..

కస్తూర్బా పాఠశాలను సందర్శించిన కలెక్టర్ విద్యార్థులు, ఉపాధ్యాయులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కస్తూర్బా పాఠశాలకు వెళ్లే దారికి సీసీ రోడ్డు, భవనం ముందు గ్రౌండ్ లెవలింగ్, స్ట్రీట్ లైట్లు, డ్రైన్ వాటర్ బయటికి వెళ్ళడానికి కాలువ, లైట్లు, సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్ డీఈ శ్రీనివాస్ ను ఆదేశించారు. వంట గది, డైనింగ్ హాల్ ను పరిశీలించారు.

ఉపాధ్యాయుడిగా మారిన జిల్లా కలక్టర్..

కస్తూర్బా పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు గణితం లెక్కను విద్యార్థులకు సులువుగా అర్థమయ్యే విధంగా, జీవితాంతం గుర్తిండిపోయే విధంగా బోధించారు. విద్యార్థుల విద్యా సామర్థ్యాలను తెలుసుకున్న కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఉన్నత చదువులు చదవాలని సూచించారు. అనంతరం రేవల్లి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను సందర్శించారు. రిజిస్టర్ లు పరిశీలించి గదులు, పరిసరాలు పరిశీలించారు. పనికిరాని చెత్త, పరిసరాలు శుభ్రం చేయించాలని పంచాయతీ సెక్రటరీనీ ఆదేశించారు. డాక్టర్లతో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్థానిక శాసన సభ్యులతో పాటు మున్సిపల్ చైర్మన్ పి. మహేష్, వనపర్తి ప్రత్యేక అధికారి యాదయ్య, వైద్య అధికారి డా.సాయినాథ్ రెడ్డి, రేవల్లి తహశీల్దార్ కే.లక్ష్మి దేవి, ఎంఈఓ శ్రీనివాస్ గౌడ్, పంచాయతీరాజ్ శ్రీనివాసులు తదితరులు కలెక్టర్ వెంట పాల్గొన్నారు.

Tags:    

Similar News