రైతులపై విషం కక్కిన రేవంత్ రెడ్డిని వదలం: మంత్రి శ్రీనివాస్ గౌడ్
రైతులు పంటలు పండించడానికి 24 గంటల కరెంట్ అవసరం లేదని, రైతుల పట్ల విషం కక్కిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని వదలిపెట్టమని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు.
దిశ, మహబూబ్ నగర్: రైతులు పంటలు పండించడానికి 24 గంటల కరెంట్ అవసరం లేదని, రైతుల పట్ల విషం కక్కిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని వదలిపెట్టమని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. వ్యవసాయానికి 24 గంటల కరెంట్ అవసరం లేదంటూ రైతులను టిపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అవమానించాడన్ని, ఆయన చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బుధవారం స్థానిక తెలంగాణ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. రైతుల పట్ల కాంగ్రెస్ పార్టీ విధానాన్ని, ఆ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తన వైఖరిని బయటపెట్టి, రైతుల పట్ల అక్కసుతో విషం చిమ్మాడని మంత్రి తీవ్రంగా విమర్శించారు. తెలంగాణలో రైతులు సుఖంగా ఉండడం చూసి రేవంత్ రెడ్డి జీర్ణించుకోలేక, కడుపు మండి కరెంట్ ఇవ్వకూడదనే తన నైజాన్ని ప్రదర్శించాడని ఆయన మండిపడ్డారు.
కాంగ్రెస్ పాలనలో కరెంట్ కష్టాలను మనమింకా మరచిపోలేదని, పగటి పూట మూడు గంటలు, రాత్రి మూడు గంటలు మాత్రమే కరెంట్ ఇచ్చి అన్నదాతలను ఆగమయ్యేలా చేశారని ఆయన విమర్శించారు. నాడు తన గురువు చంద్రబాబు, నేటి ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డి ఇద్దరూ రైతు వ్యతిరేకులేనని, రేవంత్ రెడ్డి ముక్కు నేలకు రాసి రైతులకు క్షమాపణ చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. అంతకు ముందు రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, మూడా చైర్మెన్ గంజి వెంకన్న, రాజేశ్వర్ గౌడ్, గోపాల్ యాదవ్, వెంకటయ్య, శాంతన్న యాదవ్, రెహమాన్, గిరిధర్ రెడ్డి, గణేష్ తదితరులు పాల్గొన్నారు.