అంగన్వాడీ కేంద్రాలలో పౌష్ఠికాహారం అందించండి: కలెక్టర్ కోయ శ్రీహర్ష
అంగన్వాడీ కేంద్రాలలో గర్భిణులకు, బాలింతలకు, బాలలకు పౌష్టికాహారం అందించాలని జిల్లా కలెక్టర్ తెలిపారు.
దిశ, ఊట్కూర్: అంగన్వాడీ కేంద్రాలలో గర్భిణులకు, బాలింతలకు, బాలలకు పౌష్టికాహారం అందించాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. అంగన్వాడీలలో పిల్లల తల్లిదండ్రులతో వారం వారం నిర్వహించే సమావేశాలలో భాగంగా బుధవారం నిడుగుర్తి గ్రామంలో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ప్రతి బుధవారం అంగన్వాడీ కేంద్రాలలో బాలల తల్లిదండ్రులు, అంగన్వాడీ టీచర్లు, సూపర్వైజర్ లతో సమావేశం నిర్వహిస్తున్నామని, ఇది ఒకరోజు లేదా నెలలో ముగిసేది కాదని, ఈ మీటింగ్ లు నిరంతరాయంగా కొనసాగుతాయని ఆయన తెలిపారు.
ఈ మీటింగ్ లో వయసుకు తగ్గ ఎత్తు, ఎత్తుకు తగ్గ బరువు లేని పిల్లలు తిరిగి సాధారణ బరువుకు వచ్చేలా తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు. రక్తహీనత కలిగి ఉన్న గర్భిణులు తీసుకోవాల్సిన పౌష్ఠిక ఆహారం, జాగ్రత్తల గురించి అందరూ కలిసి మాట్లాడతారని తెలిపారు. ప్రభుత్వం గర్భిణులకు, బాలింతలకు ఒక పూట పూర్తి భోజనం సమకూరుస్తుందని దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
గర్భిణీలు, బాలింతలు తప్పనిసరిగా అంగన్వాడీకి హాజరై భోజనం చేయాలని, ఉడకబెట్టిన కోడిగుడ్డు, పాలు ప్రతిరోజు తప్పనిసరిగా తీసుకోవాలని కోరారు. మూడు సంవత్సరాల లోపు పిల్లలకు అంగన్వాడీ లలో ఇచ్చే బాలామృతం ప్లస్ ని పిల్లలకు తినిపించాలని బాలలకు తల్లులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి వేణుగోపాల్, సీడీపీఓ జయ, సర్పంచ్ యశోదమ్మ, ఎంపీటీసీ, గర్భిణులు, బాలింతలు, పిల్లల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.