దిశ, కల్వకుర్తి : పైన పటారం.. లోన లొటారం.. అన్న తరహాలో ఉంది కల్వకుర్తి పట్టణంలోని డ్రైనేజీల నిర్మాణం. పైకి సిమెంట్‌తో అందంగా కనిపిస్తున్నా.. నాణ్యత లేక కొన్ని మాసాలకే డొల్లతనం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. లక్షల రూపాయలు వెచ్చించి డ్రైనేజ్ నిర్మాణాలు చేపట్టి.. నాసిరకం పనులతో నిధులు రాళ్లలో పోస్తున్నారు. ఓ వైపు నిర్మాణాలు సాగుతున్నా, ఇప్పటికే నిర్మించిన చోట కొద్దిరోజులకే పనుల్లో నాణ్యత లోపాలు బయట పడుతున్నాయి. దీనికి నిదర్శనమే కల్వకుర్తి మున్సిపాలిటీలోని 18వ వార్డు. పట్టణంలోని హనుమాన్ దేవాలయానికి వెళ్లే దారిలో మూడు మాసాల క్రితం దాదాపు రూ.4.5 లక్షల వ్యయంతో నాణ్యత లేని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణం చేపట్టారు. నాణ్యత లోపంతో గత వారం రోజుల క్రితం ఆ డ్రైనేజీ కాస్త రోడ్డు మధ్యలో గండి పడి సీకులు బయటపడ్డాయి.
అటు వెళ్లే వాహన చోదకులు, పాదచారులకు ఇబ్బందికరంగా మారింది. పగటి వేళల్లో రోడ్డు మధ్యలో రంధ్రం కనిపిస్తుంది. అదే రాత్రయితే ఆ గుంతలో పడటం కాయం అనిపిస్తోంది. ప్రస్తుతం మున్సిపాలిటిలో నాసిరకం పనులతో నాణ్యత ప్రశ్నార్థకంగా మారింది. బూడిదలో పోసిన పన్నీరులా నిధులు దుర్వినియోగం అవుతున్నాయి. డ్రైనేజ్ టెండర్‌లో ఉండేది ఓ కాంట్రాక్టర్ పేరైతే, పనులు నిర్వహించేది మాత్రం ఇంకో కాంట్రాక్టర్. మున్సిపాలిటీ పరిధిలోని కాలనీలలో ఏ పనులు జరిగిన ఆ ముగ్గురికే టెండర్లు అప్పగించడం, వాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాటలాగా ఉంది వ్యవహారం. అస్తవ్యస్తంగా మున్సిపాలిటిలోని వివిధ రకాల పనులు ఇలాగే కొనసాగుతున్నాయనడంలో అతియోశక్తి లేదు. పట్టణంలోని కొంతమంది గుత్తేదార్లు నాణ్యతలేని పనులను నిర్వహిస్తూ నిధులను సొంత గూటికి మళ్లిస్తున్నారు.
ప్రభుత్వ పనులు నిర్వహిస్తున్నప్పుడు అధికారుల పర్యవేక్షణ కరువవడంతో గుత్తేదార్లదే రాజ్యమైంది. చేసిన పనులకు క్యూరింగ్ లేకుండానే నిర్మాణాలు చేపడుతున్నారు. పట్టణంలో జరిగే డ్రైనేజ్, ఇతర నిర్మాణాలు పర్యవేక్షణ చేయడంలో మున్సిపల్ అధికారులు గాని ఇంజనీర్ అధికారులు గాని పర్యవేక్షిచడం, పరిరక్షించడంలో విఫలమవుతున్నారు. అదేవిధంగా మిషన్ భగీరథ కాంట్రాక్టర్ నీటి పైపులు ఏర్పాటు చేయడానికి గుంతలు తీయడం వల్ల కాలనీ సీసీ రోడ్లు దెబ్బతిన్నాయి. కాలనీ రోడ్లన్నీ అధ్వానంగా తయారయ్యాయి. మిషన్ భగీరథ అధికారులు నిర్లక్ష్యం వల్ల రోడ్డు నీటితో నిండి ఉంటున్నాయి. కాంట్రాక్టర్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న అడిగేవారే లేరు రోడ్డు మీదికి వస్తే దుమ్ము ధూళితో ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో నాసిరకం నిర్మాణంతో నిధులు వృథా అవుతున్నాయని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పనుల్లో కనిపించని నాణ్యత
పనుల్లో పురోగతి మాట అటుంచితే నాణ్యత విషయంలోనూ కాంట్రాక్టర్లు కక్కుర్తి పడుతున్నారు. పట్టణంలో కాంట్రాక్టర్ల కక్కుర్తి.. అధికారుల అవినీతికి చిహ్నంగా నిలుస్తుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డ్రైనేజ్, సీసీ రోడ్డు నిర్మాణాల్లో నిబంధనలు పాటించడం లేదు. ఒక పక్క నిర్మిస్తుంటే.. మరో పక్క పగుళ్లు, రంధ్రాలు పడి అగమ్య గోచరానికి అద్దం పడుతోంది. సర్కారు పనులు జరుగుతున్నప్పుడు క్వాలిటీ కంట్రోల్ శాఖ తనిఖీలు లేవు. ఇంకేముంది.. పది కాలాల పాటు పదిలంగా ఉండాల్సిన డ్రైనేజ్, సీసీ రోడ్ల నిర్మాణాల్లో నాణ్యత డొల్లతనం.. అవినీతి మయం కనిపిస్తుంది.
నిబంధనలు ఏవీ..
డ్రైనేజ్, రోడ్డు పనుల్లో నిబంధనలు పాటించడం లేదు. అయితే ఈ పనుల్లో వాడే కంకర, ఇసుక, సిమెంట్ నాణ్యత లేకపోవడంతో పిండిగా ఉండే కంకర వాడుతున్నట్లు తెలుస్తుంది. కంకర వేసి రోలింగ్ చేసే క్రమంలో వాటర్ క్యూరింగ్ సక్రమంగా చేయడం లేదు. దీనివల్ల బరువైన వాహనాలు ఈ డ్రైనేజ్ లపై వెళ్లడంతో దెబ్బతింటున్నాయి.
లేని హెచ్చరిక బోర్డులు
కాలనీలో డ్రైనేజ్, సీసీ రోడ్డు పనులు జరుగుతున్న సమయంలో వాహనదారులకు ప్రమాదాలు జరగకుండా హెచ్చరిక బోర్డులను కాంట్రాక్టర్లు ఏర్పాటు చేయకపోవడంతో వాహన దారులు ప్రమాదాల బారిన పడిన సందర్భాలున్నాయి.
శివకృష్ణ, మున్సిపాలిటీ ఏఈ, కల్వకుర్తి
డ్రైనేజ్ సమస్య మా దృష్టికి వచ్చింది. కాంట్రాక్టర్‌తో మాట్లాడం. డ్రైనేజ్ మధ్యలో రంధ్రం వాటిల్లిందని, సత్వరమే పరిష్కారించాలని 18వ వార్డు కౌన్సిలర్ చందాన సమావేశంలో విన్నపించారు. రెండు రోజుల్లోగా డ్రైనేజ్ సమస్య తీరుతుంది. నాణ్యత లేని డ్రైనేజ్ లు నిర్మిస్తే కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటాం.