గ్రామాల్లో డాక్టర్లుగా చలామణి అవుతున్న పీఎంపీలు, ఆర్ఎంపీలు
జిల్లాలో అర్హత కలిగిన డాక్టర్ల కంటే ఆర్ఎంపీ డాక్టర్లే ఎక్కువగా ఉన్నారు. వారి సంపాదన కూడా రూ.లక్షలు వెచ్చించి వైద్య విద్య చేసిన ఎంబీబీఎస్ డాక్టర్ల కంటే కూడా రెండు రెట్లు అధికంగా సంపాదిస్తున్నారనే చర్చ వినిపిస్తోంది.
దిశ, గద్వాల: జిల్లాలో అర్హత కలిగిన డాక్టర్ల కంటే ఆర్ఎంపీ డాక్టర్లే ఎక్కువగా ఉన్నారు. వారి సంపాదన కూడా రూ.లక్షలు వెచ్చించి వైద్య విద్య చేసిన ఎంబీబీఎస్ డాక్టర్ల కంటే కూడా రెండు రెట్లు అధికంగా సంపాదిస్తున్నారనే చర్చ వినిపిస్తోంది. ఇక జోగులాంబ గద్వాల జిల్లాలో ఆర్ఎంపీలు పీఎంపీలు మోతాదుకు మించి రోగులకు మందులు ఇస్తున్నారు. రోగి త్వరగా కోలుకోవడానికి చికిత్స పద్ధతులకు విరుద్ధంగా ఓవర్ డోస్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్ తో పాటు ఏకంగా స్టెరాయిడ్స్ ఇస్తుండటం ఆందోళన కలిగిస్తుంది మూత్రపిండాలు ఊపిరితిత్తుల సమస్యలు ఎదురవుతున్నాయి. ఇటీవల కాలంలో ఈ తరహా వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతున్నట్టు నిపుణులైన వైద్యులు చెబుతున్నారు. వ్యవహారంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చూసీచూడనట్లు ఉంటున్నారని విమర్శలు వస్తున్నాయి.
జిల్లాలో విచ్చల ఆస్పత్రుల నిర్వహణ..
జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా వందల సంఖ్యలో ప్రాథమిక చికిత్స కేంద్రాల రూపంలో ఆసుపత్రులు పలు గ్రామాలలో వెలుస్తున్నాయి అందులో ముఖ్యంగా గద్వాల, అలంపూర్ నియోజకవర్గంలోని పలు గ్రామాలతో పాటు గద్వాల, అయిజ లాంటి పట్టణాల్లో నకిలీ వైద్యుల ట్రీట్మెంట్లు ఎక్కువయ్యాయని, ప్రాథమిక చికిత్స కేంద్రాలుగా ఉండాల్సిన చోట బెడ్లు, మెడికల్ ల్యాబ్ ఏర్పాటు చేసుకొని వారి వ్యాపారాన్ని మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ప్రమాద కరంగా చికిత్స కేంద్రాలు..
కేవలం ఆయా రోగికి సంబంధించిన ఉన్నత వైద్య విద్య అభ్యసించిన డాక్టర్లు మాత్రమే రాయాల్సిన మందులను ఎలాంటి అర్హతలైన కొందరు ఆర్ఎంపీ డాక్టర్లు రోగులకు ఇస్తున్నారు. యాంటీబయాటిక్స్ తో పాటు స్టెరాయిడ్స్ వంటి ప్రమాదకరమైన ఔషధాలను సైతం చికిత్సకు సూచిస్తున్నారు. జిల్లాలోని ప్రముఖ ఆసుపత్రులలో పనిచేసిన అనుభవం ఉన్నవారు, మెడికల్ షాపులలో పనిచేసినవారు, డాక్టర్ల దగ్గర కాంపౌండర్లుగా పని చేసిన వారు ఇలా ఎంతో కొంత మెడికల్ పరిజ్ఞానం కలిగిన వాళ్లంతా ప్రాథమిక చికిత్స కేంద్రం పేరుట హాస్పిటల్ నడుపుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటం మారుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు ఆర్ఎంపీలైతే ప్రథమ చికిత్సకు వచ్చే రోగులకు స్టెరాయిడ్స్ తో కూడిన ఇంజక్షన్లు ఇస్తున్నారని, ఇలాంటి అవగాహన లేని వైద్యం భవిష్యత్తులో ప్రజలకు వారి ఆరోగ్యం ఎలా పట్ల దుష్పరిణామాలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు
జిల్లా వైద్యాధికారుల అరకొర దాడులు..
జిల్లాలో ఫిర్యాదులు అందినప్పుడు జిల్లా వైద్యాధికారులు అప్పుడప్పుడు జిల్లాలోని పలు ఆర్ఎంపీ డాక్టర్ లకు సంబంధించిన ప్రాథమిక చికిత్స కేంద్రాలలో అక్రమంగా నిబంధనలకు విరుద్ధంగా 10 నుంచి 20వేల వరకు మందులను నిల్వ ఉంచిన వాటిని సీజ్ చేసి వారికి నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు అనంతరం ఆర్ఎంపీ డాక్టర్లు తమకేమీ పట్టనట్లుగా వారి వైద్యం వారి మందులు వారి సంపాదన కొనసాగిస్తూ వారి ప్రాథమిక చికిత్స కేంద్రాలను పెద్ద పెద్ద హాస్పిటల్ లాగా చూపించుకుంటూ మా దగ్గరికి వస్తే చికిత్స వెంటనే నయమవుతుందంటూ రోగులను మోసం చేస్తూ ఆర్థికంగా సంపాదించుకుంటున్నారు.