ఆర్డీఎస్ నీళ్లతో ఆగమాగం.. !

జోగులాంబ గద్వాల జిల్లాలోని సాగునీటిని అందించే ఆర్డీఎస్ కాలువ నీల్లు అధికమై కొంతమంది రైతులు ఆగమాగం అవుతున్నారు.

Update: 2024-12-18 04:19 GMT

దిశ, మానోపాడు : జోగులాంబ గద్వాల జిల్లాలోని సాగునీటిని అందించే ఆర్డీఎస్ కాలువ నీల్లు అధికమై కొంతమంది రైతులు ఆగమాగం అవుతున్నారు. రోడ్లు పూర్తిగా మునిగే విధంగా ఆర్డీఎస్ నీళ్లు ప్రవహిస్తున్నాయి. దీంతో రైతులు, ఆయా గ్రామాల ప్రజలు కూడా ఇబ్బందులకు గురవుతున్నారు. వివరాల్లోకి వెళ్తే మానవపాడు మండల పరిధిలోని నారాయణపురం గ్రామ శివారులో డీ-30 ఆర్డీఎస్ కాల్వ సైఫన్ పై భాగం నుంచి సాగునీరు ప్రవహిస్తుండడంతో గ్రామంలోకి నీళ్లు ప్రవహిస్తున్నాయి. దీంతో రహదారులు సైతం కాల్వలను తలపిస్తున్నాయి. రైతు కళ్లాలోకి నీళ్లు ప్రవేశించడంతో గడ్డివాములు పూర్తిగా తడిసి ముద్దవుతున్నాయి. రోడ్ల వెంట నడవాలన్నా ఇబ్బందిగా మారిందని, ఎన్నోసార్లు తెలిపినా అధికారులు పట్టించుకోవడంలేదని స్థానికులు వాపోతున్నారు.

ఆర్డీఎస్ కాలువలో పేరుకుపోయిన సిల్క్ తొలగించకపోవడం... ఎప్పుడు పడితే అప్పుడు కాల్వకు నీళ్లు వదలడంతో సాగునీరు అధికమై కాలువ పై భాగం నుండి నీళ్లు బయటకు వస్తున్నాయని, దీంతో గ్రామంలోకి కాలువ నీళ్లు ప్రవహిస్తుండడంతో ఇబ్బందిగా మారిందని గ్రామస్తులు వాపోతున్నారు. రైతు కళ్లాలోని వరిగడ్డి, మేతలు తడిసిపోవడంతో రైతులకు పరిహారం ఇప్పించాలని వేడుకుంటున్నారు. కాలువ నీళ్లు రోడ్ల పై ప్రతిరోజు ప్రవహిస్తుండడంతో రోడ్లు కూడా పూర్తీగా దెబ్బతిన్నాయని, చాలామంది రైతులు నీళ్లలో వెళ్లలేక జారిపడుతున్నారని వాపోతున్నారు. ఇప్పటికైనా ఆర్డీఎస్ అధికారులు, మండల అధికారులు స్పందించి ఆర్డీఎస్ కాలువను పరిశీలించాలని, నీళ్లు గ్రామంలోకి ఎలా వస్తున్నాయో నేరుగా పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత నెల రోజులుగా ఈ పరిస్థితి ఉందని గ్రామస్తులు అంటున్నారు.


Similar News