మల్దకల్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం..
రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి చెంది విషాదకర సంఘటన మల్దకల్ సమీపంలో మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది.
దిశ, గద్వాల : రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి చెంది విషాదకర సంఘటన మల్దకల్ సమీపంలో మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకెళితే సంగాళ గ్రామానికి చెందిన ఈరన్న(34), తన భార్య సుజాత(32), కొడుకు చరణ్(6) తో కలిసి మల్దకల్ తిమ్మప్ప స్వామిని దర్శించుకుని మంగళవారం సాయంత్రం ద్విచక్రవాహనం పై తిరుగు పయనం అయ్యారు. ఈ క్రమంలోనే ఇటిక్యాలకు చెందిన కారు వెనుక నుండి ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై ఉన్న ఈరన్నతో పాటు, భార్య సుజాత , కొడుకు చరణ్ తీవ్ర గాయాలపాలయ్యారు.
గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు వెంటనే క్షతగాత్రులను అంబులెన్స్ లో గద్వాల ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించగా ప్రథమ చికిత్స అందించిన డాక్టర్లు మెరుగైన వైద్యం కోసం కర్నూల్ ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. కాగా చికిత్స పొందుతున్న బాలుడు చరణ్ (6) బుధవారం ఉదయం మృతి చెందాడు. సుజాత పరిస్థితి విషమంగా ఉన్నట్టు అలాగే ఈరన్న పరిస్థితి నిలకడగా ఉందని మల్దకల్ ఎస్సై నందికర్ తెలిపారు. మృతురాలు సుజాతకు ముగ్గురు ఆడపిల్లలు కాగా బాలుడు ఇలా మృత్యువాత పడటంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
ప్రమాదం జరిగిన సమయంలో ఎర్టిగా కారులో ఎనిమిది మంది ఉన్నట్టు సమాచారం. వాళ్లంతా అతిగా మద్యం సేవించడం వల్లనే ప్రమాదం జరిగినట్టు స్థానికులు తెలిపారు. ప్రమాదం అనంతరం కారును వదిలేసి అందరూ పరారయినట్టు బంధువులు తెలిపారు. కాగా పోలీసులు కేసు నమోదు చేసుకొని ఎర్టిగా కారును స్వాధీనం చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై నందికర్ దిశకు తెలిపారు.