యువకుడి ప్రాణం తీసిన లోన్ యాప్ ఏజెంట్లు
ఒకటా రెండా.. రోజుకు వందల ఫోన్ కాల్స్(Phone call).. ఇంటి ముందుకు వచ్చి నానా హంగామా.. ఈఎంఐ(EMI) డబ్బులు కడితేనే ఇంటి ముందు నుంచి కదులుతా అంటూ బెదిరింపులు..
దిశ, వెబ్‌డెస్క్ : ఒకటా రెండా.. రోజుకు వందల ఫోన్ కాల్స్(Phone call).. ఇంటి ముందుకు వచ్చి నానా హంగామా.. ఈఎంఐ(EMI) డబ్బులు కడితేనే ఇంటి ముందు నుంచి కదులుతా అంటూ బెదిరింపులు.. అప్పు తీసుకోని చెల్లించడం లేదని ఇంటి చుట్టు పక్కల వాళ్లకు చెప్పడం.. ఇలా సకాలంలో ఈఎంఐ చెల్లించలేని వాళ్లను రికవరీ ఏజెంట్లు(Loan App Recovery Agents) మానసికంగా వేధింపులకు(Harassment) గురి చేస్తున్న సంఘటనలు నిత్యం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఇలా వారి వేధింపులు తట్టుకోలేక ఇద్దరు పిల్లల తండ్రి ఆత్మహత్యకు పాల్పడటం మెదక్ జిల్లా(Medak District)లో విషాదంగా మారింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం..
మెదక్ జిల్లా కాట్రియాల గ్రామానికి చెందిన మద్ది గంగాధర్ మిషన్ భగీరథ(Mission Bhagiratha)లో పంప్ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. అక్కడ వచ్చే శాలరీతో ఈఎంఐ చెల్లించవచ్చనే ధీమాతో లోన్ యాప్‌లో రూ.3 లక్షల వరకు అప్పు తీసుకున్నాడు. కొన్ని ఈఎంఐలు సకాలంలో చెల్లించినా.. ఇటీవల కొన్ని బకాయి పడ్డాయి. దీంతో లోక్ రికవరీ ఏజెంట్లు గంగాధర్‌కు ఫోన్లు చేసి డబ్బులు చెల్లించాలని ఒత్తిడి చేశారు. ఇంటి ముందుకు వచ్చి పరువు తీసేలా ప్రవర్తించారు. దీంతో మనస్థానం చెందిన గంగాధర్.. గ్రామ శివారులోని అటవీ ప్రాంతానికి వెళ్లి పురుగుల మందు తాగాడు. గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ పరిస్థితి విషమించి గంగాధర్ ప్రాణాలు వదిలాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేపట్టారు. లోన్ యాప్ రికవరీ ఏజెంట్ల వేధింపుల వల్లనే గంగాధర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని, వెంటనే ఏజెంట్లపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.