రాష్ట్రంలో పెత్తందారి పాలన కొనసాగుతుంది..
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ఫర్ చేంజ్ ఎండ, వానలు లెక్కచేయకుండా 900 కిలోమీటర్ల పైగా కొనసాడం అభినందనీయ అని రాష్ట్రంలో పూర్తిగా పెత్తందారి పాలన కొనసాగుతుందని పిసిసి సీనియర్ ఉపాధ్యక్షుడు డాక్టర్ మల్లు రవి అన్నారు.
దిశ, అచ్చంపేట : సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ఫర్ చేంజ్ ఎండ, వానలు లెక్కచేయకుండా 900 కిలోమీటర్ల పైగా కొనసాడం అభినందనీయ అని రాష్ట్రంలో పూర్తిగా పెత్తందారి పాలన కొనసాగుతుందని పిసిసి సీనియర్ ఉపాధ్యక్షుడు డాక్టర్ మల్లు రవి అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లాలో గత రెండు రోజులుగా పాదయాత్ర కొనసాగుతూ ఆదివారం రంగాపూర్ గ్రామానికి చేరుకున్నది. అక్కడే ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజల లక్ష్యాలు నెరవేర్చకుండా విస్మరించిన బిఆర్ఎస్ ప్రభుత్వం పైన ప్రజలకున్న ఆగ్రహాన్ని ఈ పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ద్వారా బయటకు వెళ్లగకుతున్నారని.. బిఆర్ఎస్ హటావో కాంగ్రెస్ కు బచావో అనే నినాదంతో రాబోయే ఎన్నికలలో అధికార పార్టీకి తగిన గుణపాఠం చెప్తారని ఆయన జోష్యం చెప్పారు. బట్టి పాదయాత్రకు విశేష స్పందన వస్తుందని, కుల, మత ప్రాంతాలకతీతంగా బిఆర్ఎస్ ప్రభుత్వ బాధితులు ఏకమై మార్పు కావాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు.
పెత్తందారులుగా..
ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రి, మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు ప్రజా సేవకులు. కానీ వీరు పెత్తందారులుగా వ్యవహరిస్తుండ్రని, కెసీఆర్ పాలనల్లో అణచివేతకు గురవుతున్న ప్రజలు తిరుగుబాటు చేసి తిరిగి ప్రజాస్వామ్యాన్ని తెచ్చుకోవడానికి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 100 సీట్లలో గెలిపించడానికి సిద్ధమయ్యారన్నారు. రాష్ట్రం లో పోలీసు రాజ్యం నడుస్తున్నదని, ప్రశ్నించే అవకాశం లేకుండా స్వేచ్ఛను హరిస్తుండ్రని విమర్శించారు.
ప్రశ్నించే గొంతుకల పట్ల పోలీసు, రెవెన్యూ శాఖల వేధింపులు పెరిగిపోయాయని, ఇటువంటి క్రమంలో విదేశాలకు వెళ్లి వచ్చిన కేటీఆర్ బిఆర్ఎస్ పార్టీకి 100 సీట్లు వస్తాయని జ్యోతిష్యం చెప్పడం హాస్యస్పదంగా ఉందని... పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ద్వారా కాంగ్రెస్ పార్టీ తప్పక 100 సీట్లు సాధించి కర్ణాటక మాదిరిగా రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
సంక్షేమాన్ని పూర్తిగా నిర్వీర్యం..
నాగర్ కర్నూల్ డిసిసి అధ్యక్షులు వంశీకృష్ణ మాట్లాడుతూ ఈ ప్రభుత్వంలో సంక్షేమ రంగాలు వెల్ఫేర్ యాక్టివిటీస్ పూర్తిగా నిర్వీర్యం చేసి రైతు బంధు పేరుతో రైతులను మోసం చేస్తుందన్నారు. ఆదివాసి గిరిజనుల అభివృద్ధి కోసం ఏర్పాటుచేసిన ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ లేకపోవడంతో అచ్చంపేటకు వచ్చిన నిధులు రూ. కోటి యాభై లక్షల తిరిగి వెనక్కి వెళ్లాయని ఇది వాస్తవం కాదా అని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్, డీఎస్సీ, బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ ఊసే లేకుండా పోయిందన్నారు.
అచ్చంపేటలో పూర్తిగా భయానక పరిస్థితులు నెలకొన్నాయని, మరోసారి చెన్నకేశవ రాయల గండి ప్రాజెక్టుల పేరుతో ఓట్ల కోసం పాట్లు మొదలయ్యాయని, పై ప్రాజెక్టులకు సంబంధించి అన్ని రకాల అనుమతులు ప్రభుత్వము నుండి వచ్చాయని చూయిస్తే స్వయంగా నేనే సీఎం కేసీఆర్ కు పాలాభిషేకం చేస్తానని, ప్రజలను మాయ చేసే ఉత్తి మాటలు వద్దని చిత్తశుద్ధిని చాటుకోవాలని ఎమ్మెల్యేకు ఆయన సవాల్ విసిరారు. కెసిఆర్ పరిపాలనలో ఇచ్చిన కొలువుల కంటే తొలగించిన కొలువుల సంఖ్య ఎక్కువగా ఉందన్నారు. పదో తరగతి పరీక్షలను సైతం సమర్థవంతంగా నిర్వహించని చేతగాని బిఆర్ఎస్ ప్రభుత్వం అని ఏ పరీక్షలు నిర్వహించిన లీకల వ్యవహారం జోరుగా సాగుతూ నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
ఉమామహేశ్వర, చెన్నకేశవ ఈ ప్రాజెక్టులకు డీపీఆర్ ఆమోదం చేసిందా ? నీళ్ల కేటాయింపులు జరిగాయా? ఫారెస్ట్ శాఖ అనుమతులు ఇచ్చిందా ? ఇస్తే పై వాటి కాగితాలను చూపిస్తే తాను వచ్చె ఎన్నికల్లో పోటీ చేయనని గువ్వల బాలరాజుకు సవాల్ చేశారు. ఎమ్మెల్యేలు చేతివాటం ప్రదర్శిస్తున్నారని స్వయంగా ముఖ్యమంత్రి ఒప్పుకున్నారన్నారు. ఈ సమావేశంలో ఓయూ జేఏసీ నాయకులు విజయ్ కుమార్ అమ్రాబాద్ ఎంపీపీ అవుట శ్రీనివాసులు, మాజీ ఎంపీపీ ఎంపీటీసీలు సీనియర్ నాయకులు కుంద మల్లికార్జున్, రామాంజనేయులు, దాసరి శ్రీనివాసులు, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.