దిశ ప్రతినిధి, నారాయణపేట: ధరణి సమస్యలు, ఇతరత్రా పనులు చేయిస్తామని చెప్పే దళారుల చేతిలో ప్రజలు మోసపోవద్దని జిల్లా కలెక్టర్ శ్రీ హర్ష తెలిపారు. ఆయా ప్రభుత్వ శాఖలకు సంబంధించి ఉన్న సమస్యలను కలెక్టరేట్‌లో మాట్లాడి పరిష్కారం అయ్యే విధంగా చూస్తామని, ఎవరు చెప్పిన ప్రజలు నమ్మవద్దని తెలియజేశారు. తన పరిధిలో ఉన్న సమస్యలను ప్రజావాణిలో తెలుసుకుని పరిష్కరించడం జరుగుతుందన్నారు.
కొంతమంది దళారులు కలెక్టరేట్ అధికారులతో మాట్లాడినాం.. పని చేయిస్తామని ప్రజలను మభ్యపెట్టి మోసం చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. అలాంటి వ్యక్తులను నమ్మవద్దని హెచ్చరించారు. ఎవరైనా మోసం చేసినట్లు తన దృష్టికి వస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి రోజు మధ్యాహ్నం 3:30 గం౹౹ ల నుండి 5:00 గం౹౹ వరకు సందర్శకులకు సమయాన్ని సైతం కేటాయించడం జరిగిందన్నారు.