Collector : వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

మలేరియా, డెంగీ, టైఫాయిడ్ వంటి విషజ్వరాలు దరి చేరకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు.

Update: 2024-10-11 12:37 GMT

దిశ, కొత్తకోట: మలేరియా, డెంగీ, టైఫాయిడ్ వంటి విషజ్వరాలు దరి చేరకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. శుక్రవారం కొత్తకోట మండలంలోని కానాయపల్లి గ్రామంలో పర్యటించి డ్రై డే నిర్వహణను పరిశీలించారు. గ్రామంలో ఇటీవల డెంగ్యూ బారిన పడిన వారి ఇంటిని సందర్శించి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విష జ్వరాల బారిన పడకుండా ఉండేందుకు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. డ్రమ్ములు లేదా కూలర్ లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. అదేవిధంగా గ్రామంలోని వీధుల్లో పర్యటించి పరిసరాల పరిశుభ్రత గురించి ఆశా వర్కర్లు అవగాహన కల్పిస్తున్న విధానాన్ని పరిశీలించారు. గ్రామంలో ఫీవర్ సర్వే వివరాలను పరిశీలించారు. గ్రామంలో దోమల బెడద తగ్గించడానికి ఫాగింగ్ చేయాలని పంచాయతీ కార్యదర్శికి సూచించారు. అంతకుముందు కొత్తకోటకు మంజూరు అయిన 50 పడకల ఆసుపత్రి కోసం తహసీల్దార్ తో కలిసి గుంపు గట్టు సమీపంలో స్థల పరిశీలన చేశారు.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సందర్శన..

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మందుల కొరత లేకుండా చూసుకోవాలని, అవసరమైన మందులు సీడీఎస్ నుంచి తెప్పించాలని వైద్యాధికారులకు సూచించారు. కొత్తకోట, మున్సిపాలిటీ కేంద్రాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. ఆస్పత్రుల్లోని ఈడీడీ, ఓపి రిజిస్టర్లను పరిశీలించిన అనంతరం ఐపీ, డెలివరీ వార్డులను కలెక్టర్ పరిశీలించారు. ఐపీ వార్డులో చికిత్స పొందుతున్న గర్భిణులకు హిమోగ్లోబిన్ మెరుగుదల కోసం మంచి ఆహారాన్ని తీసుకోవాలని జాగ్రత్తలు చెప్పారు. రోగులకు ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా ఆస్పత్రుల్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయా అని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కొత్తకోట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భిణుల డెలివరీల వివరాలను అడిగిన కలెక్టర్ మెరుగైన పనితీరు కనబరిచిన సిబ్బందిని ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సుకేశిని విశ్వేశ్వర్, డీఎంహెచ్ఓ సాయినాథ్ రెడ్డి, స్పెషల్ ఆఫీసర్ స్వర్ణ సింగ్, మున్సిపల్ కమిషనర్ పవన్ కుమార్, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, కౌన్సిలర్లు రాములు యాదవ్, చీర్ల నాగన్న, సాగర్, తదితరులు పాల్గొన్నారు.


Similar News