ఉమ్మడి జిల్లాలో పట్టు కోసం పార్టీల పరుగులు

Update: 2023-09-20 02:26 GMT

దిశ బ్యూరో, మహబూబ్ నగర్: ఉమ్మడి జిల్లాలో ఉన్న 14 అసెంబ్లీ స్థానాలపై వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా పట్టు సాధించాలని ఇటు అధికార బీఆర్ఎస్.. అటు కాంగ్రెస్ వర్గాలు ఎవరికి వారుగా అడుగులు వేస్తున్నారు.కాంగ్రెస్ పార్టీ వర్గాలు గతంలో ఎన్నడూ లేని విధంగా వ్యూహాత్మకంగా అడుగులు ముందుకు వేస్తూ జనాల్లోకి వెళుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఒకటి రెండు నియోజకవర్గాలు మినహాయిస్తే మిగిలిన అన్ని నియోజకవర్గాలలోనూ ఇద్దరి కన్నా ఎక్కువ మంది ఆశావహులు టికెట్లు ఆశిస్తున్నారు. ఈ క్రమంలో నిర్దిష్ట సమయానికి ఆశావహులంతా పీసీసీ కార్యాలయంలో టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న విషయం పాఠకులకు విదితమే.

ఇద్దరు అంతకన్నా ఎక్కువ మంది టికెట్టు ఆశిస్తున్న నియోజకవర్గాలలో ఒకరికి టికెట్ వస్తే మిగతావారు అతడిని ఓడిస్తారు అన్న ప్రచారం ఉండేది. అందుకు తగ్గట్లుగానే ఆశావహులు ఒకరి నుంచి మరొకరు విమర్శించుకోవడం.. కలిసికట్టుగా పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకు వెళ్లకపోవడం వంటి కారణాలతో పార్టీ పరిస్థితి దెబ్బతినేది.. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని పార్టీ అధిష్టానం టికెట్ ఎవరికి వచ్చిన కలిసి కట్టుగా పనిచేయాలని.. సర్వే నివేదికల ఆధారంగా మాత్రమే టికెట్లు వస్తాయి.. పైరవీలకు ఆస్కారం ఉండదు అని చెబుతూ వచ్చారు.

దరఖాస్తు చేసుకున్న వారిలో ప్రతి నియోజకవర్గం నుంచి గెలవగల సత్తా ఉన్న ఇద్దరు ముగ్గురు నేతలను ఎంపిక చేసి పీసీసీకి పంపారు. ఈ క్రమంలో హైదరాబాద్ తుక్కుగూడ లో నిర్వహించిన బహిరంగ సభ.. సోనియా, రాహుల్ గాంధీ ఇచ్చిన సందేశాలు.. అధికారంలోకి వస్తే అమలు చేసే అంశాలు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలలో ఒకింత ఊపును తెచ్చాయి. ఆ సభ ఇచ్చిన స్ఫూర్తితో ఉమ్మడి జిల్లాలోని ఆయా నియోజకవర్గాలలో నాయకులు కలిసికట్టుగా ఉన్నాము అన్న సంకేతాలు ప్రజల్లోకి తీసుకు వెళ్లే ఆలోచనలతో అందరూ చేతులు కలిపి అడుగులు ముందుకు వేస్తున్నారు.

అక్కడక్కడ కొన్ని సమస్యలు తలెత్తుతున్నప్పటికిని వాటిని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లి ఎప్పటికీ అప్పుడు పరిష్కరించుకుంటూ ఉండటం, పైగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఉమ్మడి పాలమూరు జిల్లా వాసి కావడంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఈ జిల్లాపై ప్రత్యేక దృష్టిని సారించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అధికార బీఆర్ఎస్ నుంచి జూపల్లి కృష్ణారావు, పెద్దమందడి ఎంపీపీ మెగా రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సీతా దయాకర్ రెడ్డి, ఎన్నం శ్రీనివాసరెడ్డి తదితరులు పార్టీలో చేరడం, మరికొంతమంది ముఖ్య నేతలు కూడా అతి త్వరలోనే కాంగ్రెస్ లో చేరతారని ప్రచారం జరుగుతోంది.

జాగ్రత్త పడుతున్న అధికార పార్టీ నేతలు

ఉమ్మడి పాలమూరు జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే అధికారంలో ఉన్న విషయం పాఠకులకు. 2018 లో జరిగిన ఎన్నికలలో కొల్లాపూర్ మినహా మిగిలిన 13 నియోజకవర్గాల్లో బీ ఆర్ఎస్ విజయం సాధించడం, కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బీరం హర్షవర్ధన్ రెడ్డి గెలుపొంది ఆ తర్వాత బీఆర్ఎస్‌లో చేరడం ఎమ్మెల్యేలు అందరూ అధికార పార్టీకి చెందిన వారే అయ్యారు. ఈ నేపథ్యంలో గులాబీ పార్టీకి ఉమ్మడి పాలమూరు జిల్లా రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు కంచుకోటగా నిలుస్తూ వచ్చింది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో గులాబీ కోటలో ఎవరు పాగా వేయకూడదు అన్న ఉద్దేశంతో ఆ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు వేగంగా పావులు కదుపుతున్నారు. ఇతర పార్టీల్లో ఉన్న ముఖ్య నాయకులు కార్యకర్తలను బీఆర్ఎస్‌లో చేర్చుకుంటున్నారు.

ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నుంచి ఎత్తిపోతలను ఆరంభించారు. అక్కడి నుంచి కలశాలలో తెచ్చిన నీటిని ఆలయాలకు తీసుకెళ్లి పూజలు చేసి సెంటిమెంటుతో ప్రజలకు చేరువయ్య ప్రయత్నాలు సాగించారు. మొత్తం పై ఉమ్మడి పాలమూరు జిల్లాకు తప్పకుండా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా నీళ్లు ఇచ్చి ఓట్లు కొల్లగొట్టాలి అని చేసిన ప్రయత్నాలు కొంతమేర మంచి ఫలితాలను ఇచ్చాయి. అయినప్పటికిని ఒకవైపు కాంగ్రెస్.. మరోవైపు భారతీయ జనతా పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు ముందుకు వేస్తున్న నేపథ్యంలో రాజకీయాలు మరికొద్ది వారాల్లో రసవత్తరంగా మారనున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తంపై నియోజకవర్గాల వారీగా పట్టు సాధించేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు పోటీ పడుతున్నాయి.

Tags:    

Similar News