Shock to BRS: ముహూర్తం కుదిరినట్టే..కారు దిగి హస్తం అందుకునేందుకు ఎమ్మెల్సీ,ఎమ్మెల్యే సిద్ధం

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న ఒక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కారు

Update: 2024-07-25 02:29 GMT

దిశ,మహబూబ్ నగర్ బ్యూరో: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న ఒక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కారు దిగి చెయ్యి అందుకోవడం దాదాపు ఖరారు అయినట్లేనని అలంపూర్ నియోజకవర్గంలో జోరుగా ప్రచారం జరుగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి సంపత్ కుమార్ పై బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన విజయుడు ఎమ్మెల్సీ చల్లా వెంకటరామిరెడ్డి అండదండలతో సులభంగా విజయం సాధించిన విషయం పాఠకులకు విధితమే. ఉమ్మడి పాలమూరు జిల్లాలో గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల నుంచి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, విజయుడు మాత్రమే ఎమ్మెల్యేలుగా గెలిచిన విషయం పాఠకులకు విధితమే. ఇటీవలనే గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఆయనతోపాటు అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి వారి అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరుతారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అందుకు అనుగుణంగా బీఆర్ఎస్ అధినేతలు కేసీఆర్, కేటీఆర్ నిర్వహించే సమావేశాలకు ఈ ఇరువురు గైర్హాజరవుతూ వస్తూ ఉండడంతో వారు పార్టీ మారడం ఖాయం అని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.

అంతలోపే ఆషాడ మాసం రావడంతో చేరిక వాయిదా పడింది అని చల్ల, విజయుడు వర్గీయులు అభిప్రాయపడుతూ వచ్చారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అధికార పార్టీని ఇరుకునపెట్టే విధంగా వ్యూహరచనలు చేసేందుకు నిర్వహించిన సమావేశానికి కూడా విజయుడు, చల్లా వెంకట్రామిరెడ్డి గైర్హాజరు కావడంతో వారు పార్టీ మారడం ఖాయం అన్న నిర్ణయానికి బీఆర్ఎస్ వర్గాలు కూడా వచ్చాయి. అలంపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎత్తిపోతలు, ఇతర అభివృద్ధి పనులు జరగాలి అంటే తప్పనిసరిగా అధికార పార్టీలో చేయవలసిన అవసరం ఉందన్న నిర్ణయానికి ఎమ్మెల్సీ చల్లా వెంకట్రాంరెడ్డి, ఎమ్మెల్యే విజయుడు వచ్చారు.

ఇటీవలనే ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ప్రత్యేకంగా చర్చలు జరపడంతో పాటు నియోజకవర్గ అభివృద్ధి కోసం సహకరించాలని వినతి పత్రం అందజేసిన విషయం పాఠకులకు విధితమే. ఎమ్మెల్యే విజయుడు పై పోటీ చేసి ఓటమిపాలైన సంపత్ కుమార్ వారి రాకను మొదట్లో వ్యతిరేకించినా పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు ఆయన నోరు మెదపడం లేదని తెలుస్తుంది. ఆషాడం ముగిసిన తర్వాత శ్రావణమాసంలో పార్టీలో చేరుతారు అని అందరూ భావించారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ చేయడం, రాహుల్ గాంధీని ప్రత్యేకంగా ఆహ్వానించి ఈ సందర్భంగా వరంగల్ లో భారీ బహిరంగ సభ నిర్వహించాలన్న నిర్ణయానికి రావడంతో అదే సమయంలో పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. మొత్తంపై ఆగస్టు 6 నుంచి 10వ తేదీ వరకు ఏదో ఒక రోజున ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కారు దిగి చెయ్యి అందుకోవడం పక్కా అని అలంపూర్ నియోజకవర్గ రాజకీయ వర్గాలు అంటున్నాయి.

కనిపించని కేటీఆర్ బర్త్ డే వేడుకలు..

అలంపూర్ నియోజకవర్గంలో ప్రతి ఏటా కేటీఆర్ బర్త్ డే వేడుకలు ఘనంగా జరిగేవి. అధికారంలో లేకపోయినా ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఆయా నియోజకవర్గాలలో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరిగాయి. అలంపూర్ నియోజకవర్గంలో ఒకటి రెండు గ్రామాలలో మినహాయిస్తే ఎక్కడ కూడా కేటీఆర్ బర్త్ డే వేడుకలు జరపకపోవడంతో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు పార్టీ మారనుండడం వల్లే వేడుకలు జరగలేదు అని ప్రస్తుతం బీఆర్ఎస్ లో ఉన్న నాయకులు అంటున్నారు. హైదరాబాద్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఎమ్మెల్యే విజయుడు తప్పని పరిస్థితులలో కేటీఆర్ కు శుభాకాంక్షలు చెప్పాల్సి వచ్చినట్లు సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విజయుడు స్వయంగా కలిసి కర్నూల్ బ్యాంకులో లోన్ తీసుకున్న అలంపూర్ నియోజకవర్గ రైతులకు రుణమాఫీ చేయాలని విజ్ఞప్తి చేయడం, అందుకు సీఎం కూడా ఒకే చెప్పడంతో త్వరలోనే ఎమ్మెల్సీ , ఎమ్మెల్యే తమ అనుచరగణంతో కాంగ్రెస్ పార్టీలో చేరడం పక్కా అన్న నిర్ణయానికి నియోజకవర్గ రాజకీయ నిపుణులతో పాటు సాధారణ జనం కూడా వచ్చారు.

Tags:    

Similar News