కణితిని చంపిన నిందితుల అరెస్టు

నల్లమల అడవుల్లో స్వేచ్చగా విహరిస్తున్న వన్యప్రాణుల ప్రాణాలకు వేటగాళ్ల ముప్పు తలెత్తింది.

Update: 2024-12-26 11:09 GMT

దిశ, కొల్లాపూర్: నల్లమల అడవుల్లో స్వేచ్చగా విహరిస్తున్న వన్యప్రాణుల ప్రాణాలకు వేటగాళ్ల ముప్పు తలెత్తింది. వన్యప్రాణి కణితిని హతమార్చిన నిందితులను అటవీ శాఖాధికారులు బుధవారం అరెస్టు చేసి, మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన గురువారం నాగర్ కర్నూల్ జిల్లాలో కలకలం రేపింది. స్థానిక ఫారెస్ట్ రేంజర్ చంద్రశేఖర్ కథనం ప్రకారం వివరాల ప్రకారం..కొల్లాపూర్ ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని అమరగిరి సెక్షన్ లో ఎల్లూర్ శివారులోని ఎంజీకెఎల్ఐ జీరో పాయింట్ మంగల్ దూప్ పెంట ప్రాంతంలో వేటగాళ్లు ఉచ్చు బిగించి కణితిని హతమార్చారు. చంపిన కణితి మాంసాన్ని విక్రయిస్తుండగా తమకు కచ్చితమైన సమాచారం అందింది.  బుధవారం సాయంత్రం అమరగిరి పారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ భయన్న, బీట్ ఆఫీసర్ లక్ష్మయ్య ఇతర సిబ్బందితో కలిసి మంగల్ దూప్ పెంట ప్రాంతంలో దాడి చేశారు. ఈ దాడి సందర్బంగా ఉచ్చులూ,కణితి మాంసాన్ని స్వాధీనం చేసుకొని, అమరగిరి గూడెంకు చెందిన చెంచు నిమ్మల వెంకటస్వామి,బోడబండ తాండా కు చెందిన దేశావత్ నర్సింహ అనే నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు కొల్లాపూర్ ఫారెస్ట్ రేంజర్ చంద్రశేఖర్ వెల్లడించారు. సదరు నిందితులను అరెస్ట్ చేసి గురువారం స్థానిక కోర్టులో హాజరుపరిచినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ దాడిలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు నవీన్ కుమార్, నాగార్జున గౌడ్, కిరణ్ కుమార్, బెస్ట్ క్యాంపు సిబ్బంది ఉన్నారు.


Similar News