రెడ్ క్రాస్ నూతన భవన నిర్మాణానికి సహకరించాలని గవర్నర్‌ను కలిసిన ఎమ్మెల్యే

పట్టణంలోని సమీకృత నూతన రెడ్ క్రాస్ భవనాన్ని నిర్మాణానికి రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ సహకారం అవసరం అని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

Update: 2024-10-17 14:48 GMT

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: పట్టణంలోని సమీకృత నూతన రెడ్ క్రాస్ భవనాన్ని నిర్మాణానికి రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ సహకారం అవసరం అని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఇందులో భాగంగా.. హైదరాబాద్ రాజ్ భవన్‌లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ను కలిసి విజ్ఞప్తి చేశారు. జిల్లా కేంద్రంలోని రెడ్ క్రాస్ సొసైటీని ఆధునీకరణ చేపట్టాలని, అలాగే భవనం విశాలమైన ప్రాంగణం ఎంతో అవసరం ఉందని, ప్రస్తుత బ్లెడ్ బ్యాంక్‌ను ఇంకా అభివృద్ధి చేసుకోవాలని, ప్రతిరోజు అక్కడ అవుట్ పేషెంట్స్‌కు కూడా సేవలందించే విధంగా సౌకర్యాలను, వసతులతో కూడిన డయాగ్నొస్టిక్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేసేందుకు సహాయ సహకారాలు అందించాలని కోరారు. అలాగే వృద్ధులకు సంబంధించిన వృద్ధాశ్రమం ఏర్పాటుకు, సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించేందుకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

మహబూబ్ నగర్ నియోజకవర్గంలో ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ గురించి వివరిస్తూ.. ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న 200 మంది నిరుపేద విద్యార్థులకు ఉచితంగా మెడికల్, ఇంజనీరింగ్ ఎంట్రన్స్ శిక్షణా తరగతులను నిర్వహిస్తున్నామని, నాణ్యమైన విద్యను అందించే ఉద్దేశంతో వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు 'విద్యా నిధి' ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే వివరించారు. ఇందుకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అభినందిస్తూ.. త్వరలో మహబూబ్ నగర్‌ను సందర్శిస్తానని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రెడ్ క్రాస్ చైర్మన్ శ్రీరాములు, జిల్లా చైర్మెన్ నటరాజ్, రమణయ్య, సురేందర్ రెడ్డి‌లు పాల్గోన్నారు.


Similar News