మేడికొండ రోడ్డు బాగుచేయాలంటు ధర్నా
అయిజ నుంచి ఆరు గ్రామాలను కలుపుతూ మేడికొండ మీదుగా వెళ్లే అంతర్రాష్ట్ర రహదారిని బాగుచేయాలని ప్రయాణికులు తుప్పత్రాళ్ల సమీపంలో ధర్నా నిర్వహించారు.
దిశ, అయిజ : అయిజ నుంచి ఆరు గ్రామాలను కలుపుతూ మేడికొండ మీదుగా వెళ్లే అంతర్రాష్ట్ర రహదారిని బాగుచేయాలని ప్రయాణికులు తుప్పత్రాళ్ల సమీపంలో ధర్నా నిర్వహించారు. బుధవారం మధ్యాహ్నం ఆయా గ్రామాలకు చెందిన రెండు వందల మంది ప్రజలు ఈ రోడ్డును బాగుచేయాలంటూ ధర్నాకు దిగారు. దిశ దినపత్రికలో రోడ్డు బాగుచేయాలని ప్రచురితమైన కథనంపై అయిజ మండలంలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. 2018 నుంచి కంకర పరిచి వదిలిన ఈ రోడ్డును బాగు చేయక పోవటం వల్ల ఎంతో మంది ప్రయాణికులు ప్రమాదాలకు గురయ్యారని ఆవేదన చెందారు. ప్రజల ప్రాణాలు పట్టించుకోని ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు ఉండి ప్రయోజనమేంటని ప్రశ్నించారు. రోడ్డు నిర్మాణం చేయాలని ప్రయాణికులు చేసిన ధర్నా వల్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అటుగా వెళుతున్న వాహన దారులకు పూర్తి ఇబ్బంది కలగటంతో కొంతమంది కల్పించుకుని ధర్నాను విరమింపజేశారు.