నారాయణపేటపై ప్రధాన పార్టీల ఫోకస్

ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో జిల్లాలో రాజకీయ సందడి ఆరంభం అయింది. నియోజకవర్గం ఏర్పాటైన తర్వాత జరిగిన మూడు, నాలుగు సార్లు జరిగిన ఎన్నికల్లో

Update: 2023-06-01 02:58 GMT

దిశ ప్రతినిధి, నారాయణపేట: ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో జిల్లాలో రాజకీయ సందడి ఆరంభం అయింది. నియోజకవర్గం ఏర్పాటైన తర్వాత జరిగిన మూడు, నాలుగు సార్లు జరిగిన ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి మొదటిసారిగా టీడీపీ నుంచి, రెండోసారి బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. తొమ్మిది సంవత్సరాలకు పైగా ఆయన ఎమ్మెల్యేగా కొనసాగుతూ వస్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడంలోనూ, నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం కుదిరించడంలోనూ రాజేందర్ రెడ్డి తన ప్రత్యేకతను చాటుకుంటూ ముందుకు సాగుతున్నారు. జిల్లా కార్యాలయాల నిర్మాణాలు, మెరుగైన వైద్య సేవలు తదితర అంశాలు ఎమ్మెల్యేకు పేరు తెచ్చిపెట్టాయి. గత ఎన్నికల సమయంలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా జిల్లాకు సాగునీటిని తెచ్చితీరుతాము అని హామీ ఇచ్చారు.

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించిన పలు రకాల కేసులు నమోదు కావడం, తదితరాల వల్ల ప్రాజెక్టు ముందుకు సాగలేదు. దీంతో ఎమ్మెల్యేకు వచ్చే ఎన్నికల్లో ఎదురుగాలి తప్పదని ప్రతిపక్షాలు ఊహించాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేస్తామని ప్రకటించి ఆశలు చిగురింపజేశారు. సంవత్సరం క్రితం రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ జిల్లా కేంద్రంలో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం జరిగిన బహిరంగ సభలో వచ్చే ఎన్నికల్లో రాజేందర్ రెడ్డి పోటీలో ఉంటారు. భారీ మెజార్టీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత మీదే అని ప్రజల ముందు ప్రకటించారు.

ఉమ్మడి పాలమూరు జిల్లాలో పోటీ చేసే వారి వివరాలలో మొదటి పేరు రాజేందర్ రెడ్డిది కావడం విశేషం. కాగా గత కొంతకాలంగా నియోజకవర్గానికి దూరంగా ఉన్న జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు శివ కుమార్ రెడ్డి ఇటీవల నియోజకవర్గానికి వస్తున్నారు. పార్టీ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం వల్లే ఆయన కార్యక్రమాలకు హాజరవుతున్నట్లు ఆ పార్టీ శ్రేణులు అంటున్నాయి. గతంలో జరిగిన ఎన్నికలలో రెండు సార్లు రాజేందర్ రెడ్డి చేతిలో ఓడిపోయిన శివ కుమార్ రెడ్డి ఈసారి ఎలాగైనా విజయం సాధించి తీరాలన్న నిర్ణయంతో అడుగులు ముందుకు వేస్తున్నారు. జీవో 69, వలసలు తదితర సమస్యలను ప్రధానంగా చేసుకుని ఆయన ప్రజల్లోకి వెళ్లడానికి సన్నద్ధం అవుతున్నారు.

వచ్చే ఎన్నికల్లో శివకుమార్ రెడ్డి పోటీలో ఉంటారన్న సంకేతాలను పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా భారతీయ జనతా పార్టీ తరఫున వచ్చే ఎన్నికల్లో ముగ్గురు పోటీ పడుతున్నారు. సీనియర్ నేతలు రతంగ్ పాండు రెడ్డి, నాగూరావు నామాజీ తో పాటు యువనేత సత్య యాదవ్ ప్రయత్నిస్తున్నారు. వీరిలో సత్య యాదవ్ నియోజకవర్గంలోని దాదాపు అన్ని మండలాలలో విస్తృతంగా పర్యటిస్తూ యువత, విద్యార్థులకు రకరకాల క్రీడా పోటీలు నిర్వహిస్తూ బహుమతులను ప్రదానం చేస్తున్నారు. యువతలో ఒకింత పట్టు సాధించారు. టికెట్ తనకే వస్తుందన్న ధీమాతో సత్య యాదవ్ ఉన్నారు. అధికార బీఆర్ఎస్ పటిష్టంగా ఉండగా, కాంగ్రెస్, బీజేపీ శ్రేణులు పట్టు సాధించుకొని ఎన్నికలకు సిద్ధం అవుతున్నారు. ఎన్నికలు దగ్గర పడే కొద్ది రాజకీయ వేడి మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు అంటున్నారు.

Tags:    

Similar News