ఎల్ఆర్ఎస్ సమస్యలను పరిష్కరించాలి
గ్రామపంచాయతీ స్థాయిలో పెండింగ్ లో ఉన్న ఎల్ ఆర్ ఎస్ సమస్యలను త్వరగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులకు ఆదేశించారు.
దిశ, గద్వాల కలెక్టరేట్ : గ్రామపంచాయతీ స్థాయిలో పెండింగ్ లో ఉన్న ఎల్ ఆర్ ఎస్ సమస్యలను త్వరగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులకు ఆదేశించారు. మంగళవారం ఐడీఓసీ కాన్ఫరెన్స్ హాలులో ఎల్ ఆర్ ఎస్ దరఖాస్తులపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... జిల్లాలోని గ్రామీణ స్థాయిలో ఉన్న ఎల్ ఆర్ ఎస్ క్రమబద్ధీకరణ దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. మండలాల వారీగా పెండింగ్ లో ఉన్న ఎల్ ఆర్ ఎస్ దరఖాస్తుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు.
ప్రతి రోజూ కనీసం 25 దరఖాస్తులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని, వారం రోజుల్లో 250 దరఖాస్తులు పరిష్కరించాలని సూచించారు. దరఖాస్తుల పరిశీలన సమయంలో ప్రభుత్వ భూమి, కోర్టు కేసులు, ఎఫ్టీఎల్ పరిధిలో ఉందా అనే అంశాన్ని తప్పనిసరిగా పరిశీలించాలని సూచించారు. వారానికి మూడు రోజులు తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో తిరిగి భూమి వివరాలు గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. దరఖాస్తుల పరిశీలనలో నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. మండల స్థాయిలో ఎంపీఓ లు, గ్రామస్థాయిలో కార్యదర్శులు, ఇరిగేషన్ శాఖ ఇంజనీర్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు టీంలుగా ఏర్పడి క్షేత్రస్థాయిలో పరిశీలించాలని సూచించారు. ప్రతి దరఖాస్తు సమగ్రంగా పరిశీలించి, ఎలాంటి పొరపాట్లు జరగకుండా వివరాలను ఆన్ లైన్ లో నమోదు చేయాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగరావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాసరావు, జిల్లా పంచాయతీ అధికారి శ్యాంసుందర్, జిల్లా నీటిపారుదల శాఖ అధికారి శ్రీనివాసరావు, ఎంపీఓ లు, ఇరిగేషన్ ఏఈ లు, ఆర్ఐ లు, తదితరులు పాల్గొన్నారు.