Jurala Project : జూరాల ప్రాజెక్టుకు పోటెత్తిన వ‌ర‌ద‌.. 22 గేట్లు ఎత్తివేత‌

కృష్ణా బేసిన్‌లో కురుస్తున్న భారీ వర్షాలతో కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్‌ ప్రాజెక్టుకు వరద పోటెత్తుతున్నది.

Update: 2024-07-21 15:05 GMT

దిశ, గద్వాల : కృష్ణా బేసిన్‌లో కురుస్తున్న భారీ వర్షాలతో కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్‌ ప్రాజెక్టుకు వరద పోటెత్తుతున్నది. దీంతో కర్ణాటకు జలాశయాల నుంచి భారీగా వరద నీరు జూరాల జలాశయానికి వచ్చి చేరుతుండటంతో జూరాల వద్ద కృష్ణమ్మ జల‌సందడి చేస్తొంది. ఆదివారం సాయంత్రం కర్ణాటకలోని ఆల్మట్టికి ఇన్‌ఫ్లో 1,25,000 క్యూసెక్కులు ఉండగా అవుట్‌ఫ్లో 1,45,750 క్యూసెక్కులుగా నమోదైంది. ఆల్మట్టి సామర్థ్యం 129.72 టీఎంసీలు ఉండగా.. ప్రస్తుతం 91.90 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. నారాయణపూర్‌ ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 1,25,000 క్యూసెక్కులు ఉండగా.. 25 గేట్లు తెరవగా.. అవుట్‌ఫ్లో 1,45,750 క్యూసెక్కులు నమోదైంది. నారాయణపూర్‌ సామర్థ్యం 33.313 టీఎంసీలకుగానూ 28.820 టీఎంసీలు నిల్వ ఉన్నాయి.

కర్ణాటక జలాశయాల నుంచి..

జూరాలకు 1,11,000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదు కాగా జూరాల‌ 22 గేట్ల తెరచి దిగువకు 84,238 క్యూసెక్కులు వదిలారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 6.805 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. విద్యుత్ ఉత్పత్తికి 30,407 క్యూసెక్కులు వినియోగిస్తున్నారు. నెట్టెంపాడు ఎత్తిపోతలకు 1,500 క్యూసెక్కులు, భీమా లిఫ్ట్‌-1కు 1,300 క్యూసెక్కులు, ఎడమ కాలువకు 870, కుడి కాలువకు 596 క్యూసెక్కులు, సమాంతర కాలువకు 300 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నారు. మొత్తం జూరాల నుంచి 1,19,253 క్యూసెక్కులు వరద నీరు‌ దిగువకు విడుదల చేస్తున్నారు. కాగా మరో వారం రోజుల పాటు వరద ప్రవాహం ఇలాగే కొనసాగే అవకాశాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

సందర్శకుల తాకిడి..

జూరాల ప్రాజెక్టుకు పర్యాటకుల శోభ సంతరించుకుంది. ప్రాజెక్టుకు ఎక్కడ చూసినా పర్యాటకులే కనిపించారు. ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వస్తుండటంతో జలకళను సంతరించుకుంది. జూరాల గేట్లు ఎత్తివేసి దిగువకు నీటిని విడుదల‌ చేయడంతో కృష్ణమ్మ అందాలను తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు తరలివచ్చారు. దీంతో ఆదివారం సెలవు దినం కావడంతో పర్యాటకులు ప్రాజెక్టుకు వచ్చి సందడి చేస్తున్నారు. కొందరు జూరాల అందాలను తమ సెల్ ఫోన్ లో బంధించారు. కొందరు నీటి అంచునకు వెళ్లి సెల్పీల మోజులో పడ్డారు. జూరాల ప్రాజెక్టు పరిసరాలలో సందర్శకుల తాకిడి పెరిగి వాహనాల రాకపోకలతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. పర్యాటకులు డ్యాం పైనే తమ వాహనాలు నిలిపివేయడంతో కిల్లో మీటర్ మేర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. అమరచింత, ధరూర్ పోలీసులు జూరాల పై ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టారు.

చేపలకు భలే గిరాకీ...

జూరాలకు వస్తున్న వరదను తిలకించేందుకు వచ్చే సందర్శకుల తాకిడి జూరాల చేపల విక్రయదారులకు పంట పండించింది. ఆదివారం చేపలు రికార్డు స్థాయిలో అమ్ముడుపోవడంతో పాటు ధరలు కూడా విపరీతంగా పెంచారు. మిగతా సమయంలో రూ.120 కు లభించే చేపలు ఆదివారం రూ.300 నుంచి రూ.400 వరకు విక్రయించారు. అదేవిధంగా జూరాల చుట్టుపక్కల చేపల పులుసు, ఫ్రై దుకాణాలు కిక్కిరిసి పోవడంతో కొందరు వెనుదిరిగి పోయారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన సందర్శకులు ధరలను లెక్కచేయకుండా ఆరగించి వెళ్లారు.

Tags:    

Similar News