కళా భవన్‌కు గ్రహణం.. నాలుగేండ్లు దాటుతున్నా పూర్తికాని నిర్మాణం

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో కళాకారులు, కళాభిమానుల సౌకర్యార్థం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కళాభవన్ పనులు నత్తనడకన సాగుతున్నాయి.

Update: 2024-10-20 02:58 GMT

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో కళాకారులు, కళాభిమానుల సౌకర్యార్థం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కళాభవన్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. 2019 లో రూ.7 కోట్ల నిధుల కేటాయింపుతో అన్ని ఆధునిక హంగులతో,700 మంది ప్రేక్షకుల కెపాసిటీతో వీక్షించేందుకు ఆడిటోరియం నిర్మాణం పనులు మొదలు పెట్టారు. గత 1962, మే 4న అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి మున్సిపల్ ఆవరణలో 'టౌన్ హాల్' నిర్మాణానికి ఫౌండేషన్ వేయగా,1965 'మే' నెల 24 వ తేదీన పూర్తిఅయి, అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు దాని ప్రారంభోత్సవం చేశారు.

60 ఏండ్లుగా ఎన్నో సభలు, సమావేశాలు..

గత అరవై ఏళ్ళుగా ఆ టౌన్ హాల్ లో ఎన్నో కార్యక్రమాలు, సభలు, సమావేశాలు, నాటకాలతో ఎంతో మంది కళాకారులకు గుర్తింపు లభించింది. పండగలు, వివిధ కార్యక్రమాల సందర్భాలలో జరిగే సాంస్కృతిక ప్రదర్శనలు ప్రజలకు వినోదాన్ని, విజ్ఞానాన్ని అందించడంలో ప్రధాన భూమిక ను పోషించింది. కాలక్రమేణ పెరుగుతున్న జనాభా కనుగుణంగా టౌన్ హాల్ చిన్నది కావడం, సరైన వసతులు లేకపోవడంతో కళాకారులు, ప్రేక్షకులు ఇబ్బందులు పడేవారు, క్రమక్రమంగా టౌన్ హాల్ ప్రాథమిక తగ్గుతూ వచ్చింది. నాలుగు సంవత్సరాల క్రితం అధికారంలో ఉన్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ నూతన భవన నిర్మాణం చేపట్టి 'మున్సిపల్ కళాభారతి ఆడిటోరియం' పేర 7 కోట్ల రూపాయల మున్సిపల్ నిధులతో 2019 లో ఆర్ అండ్ బీ శాఖకు నిర్మాణ పనులను అప్పగించారు. అయితే 2020 ఫిబ్రవరిలో మొదలైన కరోనా వైరస్, 2021 వరకు కొనసాగడంతో పనులు నిలిచిపోయాయి.

అన్ని వసతులతో ఆడిటోరియం..

కళాభారతి ఆడిటోరియంలో అన్ని వసతులు, హంగులతో కళ భారతి పనులు ఆరంభించారు. దాదాపు 700 మందికి పైగా కూర్చోవడానికి వీలుగా ఉన్న ఈ కళాభారతిలో వేషధారణ కోసం ప్రత్యేక గది, మేకప్ రూం, రిహార్సల్స్ కోసం హాల్ లాంటి వసతులను కల్పిస్తున్నారు. అడ్వాన్స్ సౌండ్ సిస్టం తో పాటు, ఆధునిక కుర్చీలు, ప్రత్యేక లైటింగ్ సిస్టం,సుందరమైన స్టేజీ, ఎయిర్ కండిషన్, వాహనాల పార్కింగ్ లాంటి సౌకర్యాలను కూడా ఏర్పాటు చేయనున్నారు. అయితే అన్ని సౌకర్యాలు పూర్తి కావాలంటే ఇంకా రూ.3 కోట్ల నిధులు అవసరమని, అవి సమకూరగానే నిర్మాణం పనులు మరో మూడు,నాలుగు నెలల్లో పూర్తి అవుతాయని సంబంధిత అధికారులు అంటున్నారు. ఈ విషయంపై స్థానిక ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, కమిషనర్ మహేశ్వర్ రెడ్డిలు ప్రత్యేక దృష్టి సారించి పనులు త్వరితగతిన పూర్తి చేయించి కళాభవన్ ను అందుబాటులోకి తీసుకురావాలని కళాకారులు, కళాభిమానులు, ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.


Similar News