'ప్రధాని మోదీ, కిషన్ రెడ్డిలను విమర్శిస్తే కేసీఆర్ కు పట్టిన గతే పడుతుంది'

దేశ ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలను విమర్శిస్తే కేసీఆర్ కు పట్టిన గతే సీఎం రేవంత్ రెడ్డికి పడుతుందని జిల్లా బీజేపీ అధ్యక్షులు డి.నారాయణ అన్నారు.

Update: 2024-11-21 08:45 GMT

దిశ, వనపర్తి ప్రతినిధి : దేశ ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలను విమర్శిస్తే కేసీఆర్ కు పట్టిన గతే సీఎం రేవంత్ రెడ్డికి పడుతుందని జిల్లా బీజేపీ అధ్యక్షులు డి.నారాయణ అన్నారు. గురువారం వనపర్తి పట్టణంలోని శ్రీ లక్ష్మి కృష్ణ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వరంగల్ లో జరిగిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ నేతల పై రెచ్చిపోయి మాట్లాడటం సరికాదన్నారు. గతంలో ఏబీవీపి విద్యార్థి సంఘంలో పని చేసిన రేవంత్ రెడ్డి దేశ ప్రధాని మోదీ, కిషన్ రెడ్డిలను పాతి పెట్టాలని అనడం మూర్ఖత్వమన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం 13 వందల మంది బలిదానాలు చేసుకుంటే రేవంత్ రెడ్డి మాత్రం సమాఖ్యాంధ్రకు వత్తాసు పలికాడని ఆయన విమర్శించారు. గతంలో కేసీఆర్ బీజేపీ నేతల పై అనుచిత వాక్యాలు చేయడం వలనే తెలంగాణలో ప్రజలు పదవి భ్రష్టుని చేశారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని అప్పట్లో కిషన్ రెడ్డి దీక్ష చేపట్టి సుష్మాస్వరాజ్ లాంటి కేంద్ర మంత్రులను ఒప్పించి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామన్నారు. కిషన్ రెడ్డిని గుజరాత్ గులాం అనడం సరికాదని, రేవంత్ రెడ్డి మాత్రం ఇటలీ గులామని ఆయన ద్వజమెత్తారు.

ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు నేటికి కాంగ్రెస్ పార్టీ అమలు చేయలేదన్నారు. రెండు లక్షల రుణ మాఫీ పూర్తిగా చేయలేదని ఆయన చెప్పారు. తెలంగాణలో 8 మంది ఎమ్మెల్యేల, 8 మంది ఎంపీలను బీజేపీ కైవాసం చేసుకున్నదని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పార్మా కంపెణీల పేరిట తండాలను, గ్రామాలను బలవంతంగా ఖాళీ చేయించడం దారుణమన్నారు. మూసీ పునర్జీవనం పేరిట కోట్ల నిధులు దుర్వినియోగం చేయడం ఎంత వరకు న్యాయమన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోటిని అదుపులో పెట్టుకుని మాట్లాడాలన్నారు. వనపర్తి సెగ్మెంట్ లో అత్యధికంగా 63 వేల బీజేపీ సభ్యత్వ నమోదు అయిందన్నారు. ప్రజలు స్వచ్చందంగా బీజేపీ సభ్యత్వం తీసుకున్నందుకు ఆయన వారికి కృతజ్ఞతలు తెలిపారు. డిసెంబర్ 1 నుంచి 5 వరకు బీజేపీ ఆధ్వర్యంలో వివిధ సమస్యల పై ఉద్యమం చేపట్టబోతున్నామని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో సీనియర్ బీజేపీ నాయకులు మున్నూరు రవీందర్, రాష్ట్ర బీజేపీ నాయకులు పురుషోత్తం రెడ్డి, నాయకులు రామన్ గౌడ్, బీజేపీ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ పెద్ది రాజు తదితరులు పాల్గొన్నారు.


Similar News