గుప్తనిధుల కోసం వినాయకుడి విగ్రహాన్నే తొలగించిన్రు..!

పురాతన వినాయకుడి విగ్రహం తొలగించి గుప్తనిధుల కొరకు తవ్వకాలు చేపట్టిన ఘటన మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండల పరిధిలో తీవ్ర కలకలం రేపింది.

Update: 2023-03-20 09:45 GMT

దిశ, మిడ్జిల్: పురాతన వినాయకుడి విగ్రహం తొలగించి గుప్తనిధుల కొరకు తవ్వకాలు చేపట్టిన ఘటన మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండల పరిధిలో తీవ్ర కలకలం రేపింది. వివరాలు ఇలా ఉన్నాయి. మిడ్జిల్ మండల పరిధి కొత్తూర్ సమీపంలో గుర్తుతెలియని దుండగులు గుప్త నిధుల కొరకు దుందుభి నది ఒడ్డున ఉన్న పురాతన వినాయకుడి విగ్రహాన్ని తొలగించి పది అడుగుల మేర తవ్వకాలు చేపట్టారు. ఆదివారం రాత్రి వేళలో వినాయకుడి విగ్రహాన్ని పూర్తిగా తొలగించి పక్కన పడేసి ఆ ప్రాంతంలో క్షుద్ర పూజలకు ఉపయోగించే పూజా సామాగ్రితో క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. దీంతో కొత్తూరు గ్రామ ప్రజలు భయాందోళనకు గురయ్యారు.

సోమవారం అటువైపుగా వెళ్తున్న గ్రామస్తులు గమనించి గ్రామస్తులకు తెలపడంతో స్థానిక ప్రజాప్రతినిధులకు, పోలీసులకు సమాచారం అందించారు. పురాతన వినాయకుడి విగ్రహాన్ని ధ్వంసం చేసి గుప్తనిధుల కొరకు అన్వేషించిన దుండగులను గుర్తించి వెంటనే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, వినాయకుడి విగ్రహాన్ని యధావిధిగా పునర్నిర్మాణానికి ప్రభుత్వం చొరవ తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న మిడ్జిల్ ఎస్ఐ రాంలాల్ నాయక్ కొత్తూరు గ్రామానికి చేరుకొని, వినాయకుడి విగ్రహం ధ్వంసమైన ఘటన స్థలాన్ని పరిశీలించారు.


ఈ ఘటనపై గ్రామ సర్పంచ్ రాధిక ప్రతాప్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నామని, జల్సాలకు అలవాటు పడి అప్పనంగా డబ్బులు సంపాదించాలనే దురాశతోనే దుండగులు గుప్తనిధుల కొరకు వినాయకుడి విగ్రహం ధ్వంసం చేసి ఉంటారని, ఈ ఘటనకు పాల్పడిన వారిని పట్టుకొని చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఎస్ఐ తెలిపారు. కాగా ఈ పురాతన విగ్రహం ధ్వంసం చేసి భారీ స్థాయిలో గుప్తనిధులు దుండగులు తీసుకెళ్లి ఉంటారని గ్రామంలో ప్రజలు పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. గ్రామంలోని పురాతన వినాయకుడి విగ్రహాన్ని ధ్వంసం చేయడం పట్ల గ్రామ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

Tags:    

Similar News