గులాబీ గూటికి చేరిన మాజీ ఎమ్మెల్యే..

జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మాజీ ఎమ్మెల్యే చల్లా వెంకట్రాంరెడ్డి శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరారు.

Update: 2022-12-09 14:33 GMT

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మాజీ ఎమ్మెల్యే చల్లా వెంకట్రాంరెడ్డి శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరారు. అలంపూర్ నియోజకవర్గంలో గట్టి పట్టున్న నేతగా పేరున్న చల్ల గత కొంత కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటూ.. వచ్చారు. ఆ మధ్య ఆయన తిరిగి రాజకీయాల్లోకి వస్తారని ప్రచారం జరిగింది. భారతీయ జనతా పార్టీ, లేదా కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ప్రచారం జరగడంతో ఒక్కసారిగా రాజకీయ వర్గాలలో చర్చలు జరిగాయి. భారతీయ జనతా పార్టీ ముఖ్య నేతలు సైతం ఆయన తో సంప్రదింపులు జరిపారు. దివంగత రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి కుమారుడు అయిన చల్లా వెంకట్రాంరెడ్డి అలంపూర్ నియోజకవర్గంలో సర్పంచ్ గా తన రాజకీయ భవిష్యత్తుకు బాటలు వేసుకుని 2004లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

అనంతరం జరిగిన ఎన్నికల్లో ఈ స్థానం ఎస్సీలకు రిజర్వ్ కావడంతో ఆయన మద్దతు ఇచ్చిన వారే ఎమ్మెల్యే లుగా గెలుస్తూ వచ్చారు. 2009లో ఈ స్థానం ఎస్సీ కి రిజర్వు కావడంతో ఒకసారి డాక్టర్ అబ్రహం, రెండోసారి సంపత్ కుమార్‌కు కాంగ్రెస్ పార్టీ తరఫున అండగా నిలిచి గెలిపించారు. వచ్చే ఎన్నికల్లో వెంకట్రాంరెడ్డి మద్దతు ఎవరికి ఉంటే వారి గెలుస్తారు అని ఇప్పటికే నియోజకవర్గంలో ప్రచారం ఊపందుకున్న తరుణంలో ఆయన బీజేపీలోకి కాకుండా టీఆర్ఎస్‌లో చేరడం రాజకీయ వర్గాలలో రసవత్తర చర్చ జరుగుతుంది. చల్ల ప్రభావం అలంపూర్ నియోజకవర్గంలోనే కాకుండా గద్వాల, వనపర్తి, కొల్లాపూర్ నియోజకవర్గాల పై కూడా ఉంటుందని ఆయన వర్గీయులు చెబుతున్నారు. చల్ల వెంకట్రాం రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరడం వెనుక రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రధాన భూమికను పోషించారు.

Tags:    

Similar News