Priyanka hospital : ప్రియాంక హాస్పిటల్ ముందు బైఠాయించిన బాలింత కుటుంబ సభ్యులు..
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రియాంక హాస్పిటల్ లో సోమవారం రాత్రి కావ్య (23) బాలింత మృతి చెందింది.
దిశ, నాగర్ కర్నూల్ : నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రియాంక హాస్పిటల్ లో సోమవారం రాత్రి కావ్య (23) బాలింత మృతి చెందింది. ఈ ఘటన పై కుటుంబ సభ్యులు పట్టణవాసులు, రాజకీయ నాయకులు, హాస్పిటల్ ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... కావ్య మృతికి కారణమైన డాక్టర్ ప్రియాంకను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. గత రెండు నెలల క్రితం తాడూరు గ్రామానికి చెందిన పద్మ కూడా ఇదే ఆస్పత్రిలో మృతి చెందిందని గుర్తు చేశారు. ఇలా ఎంతమంది ప్రాణాలు తీస్తారు అంటూ ఆస్పత్రి యాజమాన్యం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా వైద్యశాఖ అధికారిని వచ్చి ఆసుపత్రి లైసెన్స్ రద్దు చేసి, సీజ్ చేసే వరకు నిరసన కార్యక్రమం చేపడతామన్నారు.
నెల క్రితం సీజ్ చేసిన ఆస్పత్రిని రాజకీయ అర్థబలం ఉపయోగించి తెరిపించారని ఆరోపిస్తున్నారు. సిజేరియన్ చేసి లక్షల్లో డబ్బులు గుంజుతున్నా వైద్యశాఖ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని పట్టణవాసులు, కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటన పై దిశ పత్రికలో ప్రైవేట్ హాస్పిటల్ సిబ్బంది నిర్లక్ష్యంతో బాలింత మృతి అనే శీర్షికన కథనాన్ని ప్రచురించడంతో పట్టణవాసులు, రాజకీయ నాయకులు, కుల సంఘాల నాయకులు వివిధ సామాజిక మాధ్యమాలలో షేర్ చేస్తూ.. ఆసుపత్రి సీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి బాధితులకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
విచారణ చేసి కలెక్టర్ కు నివేదిస్తాం : డిప్యూటీ డీఎంహెచ్వో వెంకట దాస్..
ప్రైవేట్ హాస్పిటల్ సిబ్బంది నిర్లక్ష్యంతో బాలింత మృతి చెందినట్లు పలుపత్రికల్లో వచ్చిన కథనాన్ని చూసి ఆస్పత్రిలో విచారణ చేయడానికి వచ్చాం అన్నారు. డాక్టర్, ఆస్పత్రి నిర్వాహకులు ఎవరూ లేకపోవడంతో మేనేజింగ్ డైరెక్టర్ తో మాట్లాడి వివరాలు తీసుకున్నామన్నారు. కలెక్టర్ కు నివేదిక ఇచ్చి తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.