కొత్త అసెంబ్లీ స్థానాల పై ఉత్కంఠ..!

అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ కు కేంద్ర ప్రభుత్వం

Update: 2025-03-15 01:41 GMT
కొత్త అసెంబ్లీ స్థానాల పై  ఉత్కంఠ..!
  • whatsapp icon

దిశ,మహబూబ్ నగర్ బ్యూరో: అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ కు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధం అవుతుండడంతో, ఉమ్మడి పాలమూరు జిల్లాలో కొత్తగా అసెంబ్లీ నియోజకవర్గాలుగా ఏర్పడబోయే మున్సిపాలిటీలు, మండలాలపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చలు సాగుతున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. అందులో షాద్ నగర్ నియోజకవర్గం పూర్తిగాను, కల్వకుర్తి, కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గాలు సగభాగం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉండగా.. పరిగి నియోజకవర్గంలోని మూడు మండలాలు మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నాయి. 2028లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు పునర్విభజన అనంతరమే తెలుస్తోంది.

ఒకే జిల్లాలో ఉండే విధంగా..

ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని మండలాలు. వేరువేరు జిల్లాలలో ఉన్నాయి. దీనివల్ల ప్రజలు ఇబ్బందులకు గురి కావలసిన పరిస్థితులు నెలకొంటున్నాయి. అన్ని గ్రామాలు ఒకే మండల పరిధిలో మండలాలు అన్నీ ఒకే నియోజకవర్గంలో నియోజకవర్గం పూర్తిగా ఒకే జిల్లాలో ఉండేలా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి.

అందరి దృష్టి .. వీటిపైనే..

ఉమ్మడి పాలమూరు జిల్లాలో కొత్తగా ఏర్పడే అసెంబ్లీ నియోజకవర్గాల వైపు రాజకీయ వర్గాలు ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు కొత్తగా ఏర్పాటు అయ్యే అవకాశాలు ఉన్నాయని సూచనప్రాయంగా అధికారులు, ప్రజాప్రతినిధులు అంటున్నారు. పార్లమెంట్ పరంగా చూస్తే మహబూబ్ అసెంబ్లీ నియోజకవర్గం అర్బన్, రూరల్ నియోజకవర్గాలుగా ఏర్పడడం పక్క అంటున్నారు. హన్వాడ, మహబూబ్ నగర్ టౌన్, మహమ్మదాబాద్, గండీడ్, నవాబుపేట మండలాలను కలిపి ఒక నియోజకవర్గం గాను, మహబూబ్ నగర్ మండలం, భూత్పూరు, అడ్డాకుల, మూసాపేట్ మండలాలను కలిపి రూరల్ నియోజకవర్గంగా ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మహబూబ్ నగర్ మధ్య నుంచి పోయే జడ్చర్ల- రాయ్ చూర్ రోడ్డు ప్రాతిపదికన తూర్పు, పడమర నియోజకవర్గాలుగా విభజించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మహబూబ్ నగర్ జిల్లాలో అత్యధిక గ్రామపంచాయతీలు, జనాభా ఉన్న నవాబుపేటను నియోజకవర్గంగా చేయాలని ఆ మండలానికి చెందిన కొంతమంది నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉన్న కోస్గి, లేదా మద్దూరును కొత్త అసెంబ్లీ నియోజకవర్గంగా ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం వనపర్తి జిల్లాలో.. మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉన్న అమరచింతను తిరిగి అసెంబ్లీ నియోజకవర్గం గా చేయాలని ఆ ప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. దేవరకద్ర నియోజకవర్గం వనపర్తి జిల్లాలో ఉన్న కొత్తకోట పేరు కూడా వినిపిస్తోంది. జోగులాంబ గద్వాల జిల్లాలో అయిజ మునిసిపాలిటీని నియోజకవర్గంగా ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయని, ఆ ప్రాంత రాజకీయ నేతలు అంటున్నారు. వనపర్తి జిల్లాలో ఉన్న పెబ్బేరు ను కొత్త అసెంబ్లీ నియోజకవర్గంగా ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో జిల్లా ప్రముఖ అధికార పార్టీ నేత ఉన్నట్లు తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లాలో ఉండి.. కల్వకుర్తి నియోజకవర్గంలో ఉన్న ఆమనగల్ ను అసెంబ్లీ నియోజకవర్గం గా చేయడం తథ్యం అని ఆ నియోజకవర్గ ప్రజలు అంటున్నారు.

ఆమనగల్ నియోజకవర్గం ఏర్పడితే ఆ నియోజకవర్గం పూర్తిగా రంగారెడ్డి జిల్లా లో ఉండిపోనుంది. దీంతో ఉమ్మడి పాలమూరు జిల్లాలో అదనంగా నాలుగు కొత్త అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు, పాత వాటిని కలుపుకుంటే 18 ఉండాలి.. కానీ రెండు నియోజకవర్గాలు రంగారెడ్డి జిల్లాలో ఏర్పడనున్న నేపథ్యంలో.. ఉమ్మడి పాలమూరు జిల్లాలో అసెంబ్లీ స్థానాల సంఖ్య 16 కు చేరనున్నాయి. మహిళలకు 33 శాతం సీట్లు రిజర్వ్ అయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేల రాజకీయ భవిష్యత్తు పై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి.


Similar News