కాంగ్రెస్ ప్రభుత్వంలో దళితులకు అందని నిధులు

దళిత బంధు పథకంలో ఎంపికై, ఎన్నికల కారణంగా నిధులు మంజూరు కానీ లబ్ధిదారులకు పెద్ద చిక్కే వచ్చి పడింది. బ్యాంకు ఖాతాలో డబ్బు జమైందనుకున్న క్రమంలోనే ఎన్నికలు రావడంతో, వారి నోట్లో మట్టికొట్టిన పరిస్థితి నెలకొంది.

Update: 2025-03-19 02:17 GMT
కాంగ్రెస్ ప్రభుత్వంలో దళితులకు అందని నిధులు
  • whatsapp icon

దిశ, చారకొండ: దళిత బంధు పథకంలో ఎంపికై, ఎన్నికల కారణంగా నిధులు మంజూరు కానీ లబ్ధిదారులకు పెద్ద చిక్కే వచ్చి పడింది. బ్యాంకు ఖాతాలో డబ్బు జమైందనుకున్న క్రమంలోనే ఎన్నికలు రావడంతో, వారి నోట్లో మట్టికొట్టిన పరిస్థితి నెలకొంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం దళితుల ఆర్థిక అభ్యున్నతి కోసం ప్రతిష్టాత్మకంగా దళిత బంధు పథకం ప్రవేశపెట్టడంతో, చారకొండ మండలాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి నిధులను మంజూరు చేస్తూ యూనిట్లను పంపిణీ చేసింది. అధికారుల నిర్లక్ష్యం, అర్హుల అవగాహన లోపంతో కొందరు పథకం రాలేని కారణంగా రెండో విడుతలో నమోదు చేసుకోగా, రెండో విడత ప్రభుత్వం లబ్ధిదారులను ఎంపిక చేసి నిధులను సైతం వారి ఖాతాల్లో జమ చేసింది. ఎన్నికల కోడ్ కారణంగా లబ్ధిదారులకు యూనిట్లు మంజూరు వాయిదా పడింది.

ఫలితంగా 279 కుటుంబాలు, లబ్ధిదారులు దళిత బంధు యూనిట్ల మంజూరు కోసం ఎదురుచూస్తున్నారు. ఇటీవల నిరుద్యోగుల కోసం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల నిరుద్యోగుల కోసం రాజీవ్ యువవికాసం పథకాన్ని ప్రవేశపెట్టింది. నిరుద్యోగులకు ఉపాధి కల్పించే లక్ష్యంతో ఒక్కొక్క లబ్దిదారునికి 4 నుంచి ఐదు వరకు రుణాలు ఇవ్వాలని నోటీఫికేషన్ ఇవ్వగా, తాజాగా మండల కేంద్రంలోని ఆ పథకం కోసం దరఖాస్తు చేసుకునేందుకు ప్రయత్నించే దళిత బంధు లబ్ధిదారులు రాజీవ్ యువ వికాసం పథకానికి అనర్హులుగా వెబ్ సైట్ లో చూపిస్తుంది. ఫలితంగా మండలంలోని దళిత బంధు పథకం రాని దళిత కుటుంబాలు అనర్హులుగా మిగిలిపోతున్నారు. ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం, సమన్వయ లోపం తో దళిత కుటుంబాలు సంక్షేమ పథకాలను కోల్పోతున్నారు.

తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి దళిత బంధు లబ్ధిదారులకు యూనిట్లు మంజూరు చేయాలని వారు కోరుతున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో వినతిపత్రం అందజేశామని, అయినా అధికారులు యూనిట్ల మంజుల్లో జాప్యం చేస్తున్నారని దళిత బంధు సాధన కమిటీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు పట్టించుకోకపోవడంతో దళిత కుటుంబాలు సంక్షేమ పథకాలకు నోచుకోవడం లేదని ప్రజలు బహిరంగంగా చర్చించుకుంటున్నారు. అధికారులు స్పందించి దళిత బంధు నిధులు విడుదల చేయాలని లేని పక్షంలో ఉద్యమిస్తామని, రెండో విడత దళిత బంధు సాధన కమిటీ సభ్యులు హెచ్చరించారు.

నిధులు మంజూరు చేస్తాం

చారకొండ మండలంలో దళిత బంధు పథకం అమలు చేసినందున రాజీవ్ యువ వికాసం పథకం వెబ్ సైట్ లో అనర్హులుగా చూపిస్తుంది. రాజీవ్ యువ వికాసం నిధులు మంజూరు కావడానికి ఆరు నెలల సమయం పట్టొచ్చు. ఆలోపు రెండో విడత దళిత బంధు నిధులను మంజూరు చేసి యూనిట్లు పంపిణీ చేస్తాం. - రామ్ లాల్ నాయక్, ఈడీ, నాగర్ కర్నూల్ జిల్లా

అధికారుల ఏం చెప్పడం లేదు..

అధికారుల చుట్టూ ఎన్ని సార్లు తిరిగినా సరైన స్పందన లేదు. మొదటి విడత బంధు పథకంలో అధికారుల నిర్లక్ష్యంతో అనర్హులుగా మిగిలి పోయాం. కలెక్టర్ కు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీకి వినతిపత్రం అందజేశాం. నిధులు మంజూరు చేయాలి.- రమేష్, దళిత బంధు బాధితుడు

అనర్హుడిగా చూపిస్తుంది

రెండో దళిత బంధు లబ్ధిదారునిగా ఎంపిక చేసి నిధులు, యూనిట్లు మంజూరు చేయలేదు. ప్రస్తుతం రాజీవ్ యువ వికాసం పథకానికి నమోదు చేసుకుంటే అనర్హుడిగా చూపిస్తుంది. ప్రభుత్వం స్పందించి మాకు న్యాయం చేయాలి. గతంలో మంజూరైన దళిత బంధు నిధులు జమ చేయాలి. - కొండల్, దళిత బంధు బాధితుడు


Similar News