నల్లమలలో గుప్తనిధుల తవ్వకాలు
నాగర్ కర్నూల్ జిల్లా నల్లమలలోని అమ్రాబాద్ మండలం బీకే లక్ష్మాపూర్ గ్రామ సమీపంలో ఉన్న లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం అర్ధరాత్రి కొంతమంది తవ్వకాలు జరుపుతున్నట్లు గ్రామస్తులకు సమాచారం రావడంతో అక్కడికి వెళ్లి చూడగా సుమారు ఎనిమిది మంది గుడిలో తవ్వకాలు చేసినట్లు స్థానికులు తెలిపారు.
దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూల్ జిల్లా నల్లమలలోని అమ్రాబాద్ మండలం బీకే లక్ష్మాపూర్ గ్రామ సమీపంలో ఉన్న లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం అర్ధరాత్రి కొంతమంది తవ్వకాలు జరుపుతున్నట్లు గ్రామస్తులకు సమాచారం రావడంతో అక్కడికి వెళ్లి చూడగా సుమారు ఎనిమిది మంది గుడిలో తవ్వకాలు చేసినట్లు స్థానికులు తెలిపారు. గ్రామస్తుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.
గురువారం అర్ధరాత్రి ఒక కారు, ద్విచక్ర వాహనంపై కొంతమంది లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోని అంతర్భాగంలో గుప్తనిధుల కోసం తవ్వకాలు చేస్తున్నారని స్థానికులకు సమాచారం అందింది. దాంతో వారు గుడి వద్దకు వెళ్లేసరికి గుప్తనిధులను పరిశీలించే పరికరాలతో కొందరు కనిపించారని, తమని చూసి పారిపోయారని పేర్కొన్నారు. ఈ క్రమంలో అక్కడే ఒక ఉద్యోగితో పాటు వ్యక్తి పట్టుపడ్డారని చెప్పారు. దీనిపై వారిని నిలదీయగా ఎదరుదాడికి దిగారని పేర్కొన్నారు.
అదుపులోకి తీసుకున్నారు... వదిలేశారు...
విషయం తెలుసుకున్న అమ్రాబాద్ పోలీసులు ఆలయానికి చేరుకొని పట్టుబడిన ఒక ఉద్యోగి మరో వ్యక్తితో పాటు కారు, ఓ ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారని గ్రామస్తులు తెలిపారు. కానీ తెల్లవారేసరికి వాహనాలను, పట్టుబడ్డ ఇద్దరు వ్యక్తులను పోలీసులు వదిలేశారని ఆరోపించారు. అనంతరం శుక్రవారం పలువురు గ్రామస్తులు గుప్తనిధుల కోసం వచ్చిన వారిని అరెస్టు చేయాలని అమ్రాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ విషయంపై అమ్రాబాద్ ఎస్సై రమేష్ ను వివరణ కోరగా రవి, హరి అనే ఇద్దరు వ్యక్తులు ఆలయం వద్ద ఉన్నారని, మరికొంతమంది వారిపై గ్రామస్తులు దాడి చేస్తారనే భయంతో పారిపోయి ఉంటారని, తదుపరి విచారణ చేపడుతున్నామని ఎస్సై తెలిపారు.