ముసురు వానతో ముప్పు..
వర్షాకాలం ప్రారంభం కావడంతో చాప కింద నీరులా సీజనల్ వ్యాధులు సోకే అవకాశం ఉంది. గత ఐదు, ఆరు రోజులుగా పల్లెలలో ముసురు వానలు కురుస్తుండటంతో ఒక పక్క చిటపట వానలు.. చల్లటి గాలులు వీస్తున్నాయి.
దిశ, ఊట్కూర్ : వర్షాకాలం ప్రారంభం కావడంతో చాప కింద నీరులా సీజనల్ వ్యాధులు సోకే అవకాశం ఉంది. గత ఐదు, ఆరు రోజులుగా పల్లెలలో ముసురు వానలు కురుస్తుండటంతో ఒక పక్క చిటపట వానలు.. చల్లటి గాలులు వీస్తున్నాయి. చిన్నపిల్లలు, వృద్ధులు చల్లటి గాలులు వాతావరణం నెలకొనటంతో... వర్షానికి అయిన తట్టుకోవచ్చు గాని చల్లటి గాలులకు తట్టుకోలేకపోతున్నామని అంటున్నారు. ప్రధానంగా కొన్ని గ్రామాల్లో పారిశుధ్యం సరిగ్గా లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మురుగునీరు వెళ్ళటానికి కాలువలు నిర్మించకపోవడం ప్రధాన సమస్యగా చెప్పుకోవచ్చు. దీంతో వర్షపు నీరు గుంతలలో నిలిచి మురుగునీరుగా మారి ఉండటంతో దోమలకు ఆవాసంగా మారి వ్యాధుల బారిన పడే అవకాశం పొంచి ఉంది. ఇప్పటికే పల్లెలలో దోమలు వ్యాప్తి చెందుతున్నాయి.
ప్రభుత్వ అధికారులు వ్యక్తిగత పరిసరాలు, పరిశుభ్రత పైన పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అధికారులకు గ్రామ సభలలో పిచ్చి గడ్డి, దోమల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ప్రజలు సైతం కోరుతున్నారు. వర్షాకాలం వచ్చిందంటే ప్రధానంగా మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్, జలుబు, దగ్గు, విష జ్వరాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉండటంతో జాగ్రత్తలు పాటించవలసిన అవసరం ఎంతైనా ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. వాతావరణం ఒక్కసారిగా చెల్లబడినప్పుడు వైరల్ ఇన్ఫెక్షన్స్, చర్మసమస్యలు, ఆస్తమా, డయాబెటిస్ బాధితులు ఎక్కువగా తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించాలని డాక్టర్లు సూచిస్తున్నారు. మరోవైపు వర్షాలు కురుస్తుండటంతో రోజువారి వ్యాపారస్తులకు ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.