Collector Sikta Patnaik : ధరణి పెండింగ్ దరఖాస్తులను త్వరితిగతన పరిష్కరించండి..
ధరణి పెండింగ్ దరఖాస్తులను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, సీసీఎల్‌ఏ నవీన్‌మిత్తల్ ఆదేశించారు.
దిశ, నారాయణపేట ప్రతినిధి : ధరణి పెండింగ్ దరఖాస్తులను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, సీసీఎల్‌ఏ నవీన్‌మిత్తల్ ఆదేశించారు. శనివారం ఆయన అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలు, తహశీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతిరోజు పెండింగ్ దరఖాస్తులు పరిశీలించాలన్నారు. నారాయణపేట జిల్లా కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి వీసీలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ జిల్లాలో కలెక్టర్, అదనపు కలెక్టర్ లాగిన్ లో ఉన్న పెండింగ్ దరఖాస్తులను రానున్న పది రోజుల్లో క్లియర్ చేయనున్నట్లు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శికి తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ధరణి దరఖాస్తులను వేగవంతంగా క్లియర్ చేయాలని ఆర్డీవో, అన్ని మండలాల తహశీల్దార్లను ఆదేశించారు.
ముఖ్యంగా మక్తల్, నారాయణపేట, ఉట్కూర్ మండలాల్లో ఎక్కువ దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని, వాటిని క్లియర్ చేయాలని కలెక్టర్ ఆయా మండలాల తహశీల్దార్లను ఆదేశించారు. ధరణి సమస్యల పై ఆర్డీవో తమ లాగిన్ లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు. ధరణి సమస్యల పై దరఖాస్తు చేసుకున్న ప్రతి దరఖాస్తు దారుల సమస్యలను పెండింగ్లో లేకుండా చూడాలన్నారు. పరిష్కరించిన ప్రతి దరఖాస్తుకు ప్రొసీడింగ్ ఆర్డర్‌ను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని తిరస్కరిస్తే, ఎందుకు రిజెక్ట్ చేశారో తెలుపుతూ రిమార్కులను నమోదు చేయాలని ఆదేశించారు. దరఖాస్తులను ఆన్‌లైన్‌లో ఓపెన్ చేసేందుకు, వాటి పరిష్కారానికి అవసరమైన రిపోర్టులు అప్‌లోడ్ చేసేందుకు ప్రత్యేక లాగిన్‌లో నమోదు చేయాలన్నారు. మండలాల వారీగా పెండింగ్ దరఖాస్తులను రివ్యూ చేసుకోవాలని, అధికంగా పెండింగ్ ఉన్న మండలాల పై, ఆర్డీవో ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. వారం రోజుల్లో పెండింగ్ దరఖాస్తులన్ని పరిశీలించి ధరణి పెండెన్సి లో జిల్లాను జీరో స్థాయికి తీసుకురావాలని గడువు విధించారు.