దిశ ఎఫెక్ట్..అధికారి సస్పెండ్

దిశ ఎఫెక్ట్‌తో జడ్చర్ల మండలంలోని పోలేపల్లి పంచాయతీ పూర్వపు కార్యదర్శి సస్పెండ్ అయ్యారు.

Update: 2024-10-18 10:34 GMT

దిశ,జడ్చర్ల : దిశ ఎఫెక్ట్ తో జడ్చర్ల మండలంలోని పోలేపల్లి పంచాయతీ పూర్వపు కార్యదర్శి సస్పెండ్ అయ్యారు. పంచాయతీలో రికార్డుల ట్యాంపరింగ్ విషయమై దిశ దినపత్రికలో "పోలేపల్లి గ్రామ పంచాయతీలో రికార్డుల ట్యాంపరింగ్ " అనే హెడ్ లైన్ తో ప్రచురితమైన వార్తకు అనూహ్యమైన స్పందన లభించింది. వార్తపై స్పందించిన జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి, పదవి విరమణ చేసిన డిఎల్ పిఓ పండరీనాథ్ తో సమగ్ర విచారణ జరిపించారు. గ్రామపంచాయతీలో రూ.1.73 కోట్ల నిధుల దుర్వినియోగానికి కారకులుగా తేలిన వారిపై చర్యలకు ఆదేశించారు. అందుకు బాధ్యుడైన గ్రామ పంచాయతీ పూర్వపు కార్యదర్శి శివ ప్రకాష్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే బాధ్యులైన గ్రామ సర్పంచ్ చేతనా రెడ్డికి షోకాజు నోటీసులు జారీ చేశారు. షోకాజ్ నోటీసులను గ్రామపంచాయతీ నూతన కార్యదర్శి లక్ష్మీ నారాయణతో సర్పంచ్ చేతనా రెడ్డికి అందించేందుకు అధికారులు పంపారు. గతంలో పంచాయతీ కార్యదర్శిగా పనిచేసి సస్పెండ్ అయిన శివ ప్రకాష్ ప్రస్తుతం హన్వాడ మండలంలోని అమ్మాపూర్ తాండాలో పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఈ విషయంలో కేవలం గ్రామపంచాయతీ కార్యదర్శిని మాత్రమే సస్పెండ్ చేసి అందుకు బాధ్యులుగా.. విచారణలో తేలిన గ్రామ సర్పంచ్ కు షోకాజ్ నోటీసులు మాత్రమే జారీ చేయడం లోని ఆంతర్యం ఏమిటో బోధపడడం లేదని గ్రామస్తులు వ్యాఖ్యానిస్తున్నారు. నిధుల రికవరీకి ఆదేశించడంతో పాటు.. చట్టపరంగా వారిపై కఠిన చర్యలు తీసుకుంటేనే భవిష్యత్తులో నిధుల దుర్వినియోగానికి ఎవరు చేసే అవకాశం ఉండదని గ్రామస్తులు అభిప్రాయపడుతున్నారు.


Similar News