త్వరలో డిసిసిబి మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ సేవలు
జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ లిమిటెడ్ ఆధ్వర్యంలో త్వరలోనే మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ సేవలను అందుబాటులోకి తేనున్నట్లుగా ఆ బ్యాంకు చైర్మన్ మావిళ్ళపల్లి విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు
దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ లిమిటెడ్ ఆధ్వర్యంలో త్వరలోనే మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ సేవలను అందుబాటులోకి తేనున్నట్లుగా ఆ బ్యాంకు చైర్మన్ మావిళ్ళపల్లి విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. బుధవారం బ్యాంకు మహాజనసభకు అధ్యక్షత వహించిన విష్ణువర్ధన్ రెడ్డి బ్యాంకు సేవలను గురించి పలు అంశాలను వివరించారు. బ్యాంకు ఉద్యోగుల కృషి ఫలితంగా రుణాల వసూళ్లలో గణనీయమైన ప్రగతిని సాధించడం జరిగిందని చెప్పారు. ఆర్బిఐ నుండి వీక్ బ్యాంక్ స్టేటస్ తొలగిపోయిందని ఆయన తెలిపారు. ఈ సంవత్సరం నవంబర్ 30వ తేదీ నాటికి బ్యాంకు డిపాజిట్లు దాదాపుగా 400 కోట్ల రూపాయలకు చేరుకున్నాయని తెలిపారు. బ్యాంకు ద్వారా ఇప్పటివరకు 670 కోట్ల రూపాయల స్వల్పకాలిక రుణాలు, 170 కోట్లు దీర్ఘకాలిక రుణాలు, 286 కోట్ల రూపాయలు వివిధ ప్రయోజనాల కోసం రైతులకు, వినియోగదారులకు అందజేయడం జరిగిందని విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మార్చి 31వ తేదీ నాటికి 1800 కోట్ల రూపాయల టర్నోవర్ లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. రానున్న రోజులలో బ్యాంకును మరింత ప్రగతి పథంలో పయనింపజేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో బ్యాంకు ఉపాధ్యక్షుడు కోరమోని వెంకటయ్య, ముఖ్య కార్యనిర్వాణాధికారి పురుషోత్తం రావు, వివిధ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల అధ్యక్షులు, సభ్యులు, బ్యాంకు అధికారులు పాల్గొన్నారు.