సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో వసూళ్ల పర్వం

అక్రమాలు, వసూళ్ల పర్వానికి కేరాఫ్ గా మారింది నారాయణపేట సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్. ఇక్కడ ఓ ప్రైవేట్ వ్యక్తి 30 ఏళ్లుగా చెప్పిందే వేదం.. సాధారణంగా ప్రభుత్వ నిబంధనల మేరకు ఆన్లైన్లో ఫీజులు చెల్లించిన ఆస్తులకు ఎలాంటి రుసుములు

Update: 2023-07-31 03:29 GMT

దిశ ప్రతినిధి, నారాయణపేట : అక్రమాలు, వసూళ్ల పర్వానికి కేరాఫ్ గా మారింది నారాయణపేట సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్. ఇక్కడ ఓ ప్రైవేట్ వ్యక్తి 30 ఏళ్లుగా చెప్పిందే వేదం.. సాధారణంగా ప్రభుత్వ నిబంధనల మేరకు ఆన్లైన్లో ఫీజులు చెల్లించిన ఆస్తులకు ఎలాంటి రుసుములు వసూలు చేయొద్దు. కానీ అందుకు విరుద్ధంగా ఆయా రిజిస్ట్రేషన్లు బట్టి రేట్లు ఫిక్స్ చేస్తాడు ఆ ప్రైవేట్ వ్యక్తి.. అధికారులు సైతం అతడు చేసే పనులకు సహకరించడం.. ఇదేంటని ప్రశ్నించిన కార్యాలయ సిబ్బందిని డిప్యూటేషన్ పై పంపించడం పలు విమర్శలకు తావిస్తున్నది. ఎనిమిది నెలల్లో నలుగురు సిబ్బందిని బదిలీ చేశారంటే ఆ ప్రైవేట్ వ్యక్తికి అధికారులు సహకరించడమే అందుకు కారణమంటూ ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కార్యాలయంలోని అక్రమాలు, అవినీతిపై ఇటీవల కలెక్టర్ సైతం తనిఖీ చేశారు. అయినప్పటికీ తీరు మారకపోవడం గమనార్హం. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, కలెక్టర్ స్పందించి ఆ ప్రైవేట్ వ్యక్తితోపాటు అక్రమాలకు సహకరిస్తున్న సిబ్బందిపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

రిజిస్ట్రేషన్లు చేయాల్సిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సాగుతున్న వసూళ్ల పర్వం నారాయణపేట జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. రిజిస్ట్రేషన్ల కోసం వచ్చేవారి నుంచి బహిరంగంగా చేస్తున్న వసూళ్లు అవసరాల కోసం వస్తున్న జనాన్ని నానా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ప్రైవేటు వ్యక్తులు చేస్తున్న వసూళ్ల మాయలో అధికారులు సైతం కిమ్మనకుండా పనులు చేస్తున్నారు. దాదాపుగా 30 ఏళ్లుగా ఓ ప్రైవేటు వ్యక్తి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో మరికొందరు వ్యక్తులతో కలిసి చక్రం తిప్పుతూ అధికారులను బుట్టలో వేసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. రిజిస్ట్రేషన్ ల కోసం వచ్చే జనం అధికారుల దగ్గరకు వెళ్లి తమ రిజిస్ట్రేషన్ల వివరాలను వెల్లడిస్తే.. వెళ్లి ఫలానా వ్యక్తిని కలవండి అని అధికారులు ఉచిత సలహాలు ఇవ్వడంతో జనం వారి వద్దకు వెళుతున్నారు. ప్లాట్లు, ఇండ్లు తదితరాలకు సంబంధించి ఆ ప్రైవేట్ వ్యక్తి వాల్యుయేషన్ నిర్ణయిస్తున్నాడు. ఆ వాల్యుయేషన్ కు సంబంధించిన రుసుము ఆన్లైన్లో చెల్లించిన తర్వాత మామూళ్ల పర్వం ప్రారంభం అవుతోంది. గ్రామీణ ప్రాంతాలలో గ్రౌండ్ ఫ్లోర్ ఇండ్లను ఒకరి పేరు మీద నుంచి మరొకరికి రిజిస్ట్రేషన్ చేయవలసి వస్తే అందుకు సంబంధించిన ప్రభుత్వ రుసుంను ఆన్లైన్లో చెల్లించినా 250 గజాలలో ఉన్న ఇంటికి రూ.20 వేల నుంచి రూ.30 వేలు, అంతకన్నా ఎక్కువ ఉంటే రూ.50 వేలు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. భాగ పరిష్కారాల విషయంలోనూ రూ.20 నుంచి 30 వేల రూపాయలు, శిథిలమై ఉన్న ఇండ్ల ఖాళీ స్థలాలను రిజిస్ట్రేషన్ చేయడానికి కూడా రూ.పది నుంచి పదిహేను వేల వరకు వసూలు చేస్తున్నారు. ప్రైవేటు బ్యాంకులు సంస్థల నుంచి రుణాలు పొందేందుకు అవసరమయ్యే ఈసీ, సీసీ పత్రాలకు ప్రభుత్వ రుసుము చెల్లించిన తర్వాత కూడా రూ.50 నుంచి 500 రూపాయల వరకు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. సబ్ రిజిస్టర్ కార్యాలయంలో పెద్ద ఎత్తున సాగుతున్న ఈ వసూళ్ల పర్వంపై ప్రజాప్రతినిధులు, అధికారులకు అందరికీ తెలిసినా నోరు మెదపకుండా పనులు చేయించుకుంటున్నారు. సాధారణ జనం మాత్రం తీవ్ర ఇబ్బందుల పాలు కావలసి వస్తోంది. ఈ వసూళ్ల పర్వం వ్యవహారాలలో ప్రశ్నించినందుకు, ఇతర కారణాలవల్ల గత ఎనిమిది నెలలలో ఏకంగా నలుగురు సిబ్బందిని ఇతర చోట్లకు డిప్యూటేషన్ పై అధికారులు పంపారు. ఈ వ్యవహారాలపై ఇటీవల కొంతమంది జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేయడంతో ఆకస్మికంగా తనిఖీ చేశారు. వస్తున్న ఫిర్యాదులపై అధికారులు, సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తీరు మారకుంటే కఠిన చర్యలు ఉంటాయని కలెక్టర్ హెచ్చరించారు. అయినప్పటికీ కలెక్టర్ తనిఖీ చేసిన మరుసటి రోజు ఏమాత్రం మార్పులు లేకుండా వసూళ్ల పర్వం కొనసాగినట్లు తెలుస్తోంది. కలెక్టర్ తనిఖీ చేసే సమయంలో ఆ ప్రైవేటు వ్యక్తులు ఉండకపోవడం విశేషం. కాగా ఇక్కడ తతంగం నడుపుతున్న ప్రైవేటు వ్యక్తి ఆస్తులు కూడబెట్టుకున్నట్లు సమాచారం ఉన్నతాధికారులు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో జరుగుతున్న అవకతవకలు, వసూళ్ల పర్వాన్ని ఆపాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు.


Similar News